Site icon HashtagU Telugu

OpenAI : భారత్‌లో ఓపెన్‌ఏఐ దృష్టి.. ఢిల్లీలో తొలి కార్యాలయం

OpenAI's focus on India...first office in New Delhi

OpenAI's focus on India...first office in New Delhi

OpenAI : ప్రపంచంలో ఏఐ రంగంలో కీలక స్థానాన్ని సంపాదించిన చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) ఇప్పుడు భారత్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతున్న వేళ భారత్‌లో చాట్‌జీపీటీ వినియోగం గణనీయంగా పెరుగుతుండటంతో ఈ సంస్థ న్యూఢిల్లీలో తొలి కార్యాలయం స్థాపించేందుకు కార్యాచరణను ప్రారంభించింది. ఈ కార్యాలయం ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందని సమాచారం. ఓపెన్‌ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ ఈ సందర్భంగా స్పందిస్తూ..భారత్‌ వంటి దేశంలో ఏఐ విస్తరణకు అసాధారణమైన అవకాశాలున్నాయి. ప్రతిభావంతులైన టెక్ టాలెంట్‌, ప్రభుత్వ సహకారం, మరియు బలమైన డెవలపర్ కమ్యూనిటీ వంటి అంశాల కారణంగా, భారత్‌ను మరింత సమర్థవంతంగా సేవలందించే కేంద్రంగా మార్చే దిశగా ముందుకెళ్తున్నాం అని పేర్కొన్నారు.

భారత్‌: ఓపెన్‌ఏఐకి రెండో అతిపెద్ద మార్కెట్

చాట్‌జీపీటీ తాజా గణాంకాల ప్రకారం, భారత్‌ అమెరికా తర్వాత రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఎదిగింది. వినియోగదారుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే నాలుగు రెట్లు పెరగడం గమనార్హం. ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రొఫెషనల్స్ మరియు డెవలపర్లు పెద్దఎత్తున చాట్‌జీపీటీని ఉపయోగిస్తున్నారు. వారంలో యాక్టివ్ యూజర్ల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఇతర గణాంకాల ప్రకారం, ఓపెన్‌ఏఐ ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న టాప్-5 డెవలపర్ దేశాల్లో భారత్‌ ఒకటి. అంతేకాకుండా, చాట్‌జీపీటీని ఎక్కువగా వినియోగించే విద్యార్థుల సంఖ్యలో భారత్ మొదటి స్థానంలో నిలిచింది.

ఇండియా ఏఐ మిషన్‌కు ఓపెన్‌ఏఐ మద్దతు

ఇక, మరోవైపు, ఓపెన్‌ఏఐ ఇప్పటికే ఇండియా ఏఐ మిషన్‌కు భాగస్వామిగా మారేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ మిషన్‌లో భాగంగా ప్రభుత్వానికి అవసరమైన ఏఐ వ్యవస్థల అభివృద్ధికి ఓపెన్‌ఏఐ తోడ్పడుతోంది. ఈ భాగస్వామ్యం ద్వారా భారత ప్రజలకు మరింత నాణ్యమైన, లాభదాయకమైన సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడనుంది.

“చాట్‌జీపీటీ గో”తో సులభమైన సబ్‌స్క్రిప్షన్ సేవలు

ఓపెన్‌ఏఐ ఇటీవలే “చాట్‌జీపీటీ గో (ChatGPT Go)” పేరుతో కొత్త సేవను భారత వినియోగదారులకు పరిచయం చేసింది. కేవలం రూ.399 ధరతో ఈ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో అపరిమిత మెసేజ్‌లు పంపే అవకాశం. అధిక పరిమితితో ఇమేజ్ జనరేషన్. ఫైల్ అప్‌లోడ్‌ చేసుకునే సౌలభ్యం. ఇండిక్ భాషలకు మద్దతు. మరియు యూపీఐ (UPI) ద్వారా చెల్లింపుల సదుపాయం. ఇలాంటి సేవలు చాట్‌జీపీటీని మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడమే కాక భారతీయ వినియోగదారులకు అనుకూలంగా తీర్చిదిద్దబడ్డాయని స్పష్టంగా తెలుస్తోంది.

ముందుకున్న ప్రణాళికలు

భారత ప్రభుత్వం ఇంకా ఓపెన్‌ఏఐ కార్యాలయం స్థాపనకు సంబంధించిన అంశాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉన్నా, ఇది ఓపెన్‌ఏఐ భారత్‌ను ఒక ముఖ్యమైన వ్యాపార కేంద్రంగా మలచే దిశగా తీసుకున్న మైలురాయి చర్యగా చెబుతున్నారు నిపుణులు. భారత్‌లో ఏఐపై పెట్టుబడులు పెరుగుతున్న వేళ, ఓపెన్‌ఏఐ వంటి గ్లోబల్ లీడర్ సంస్థ దేశంలో కార్యకలాపాలు విస్తరించటం ద్వారా భారత టెక్ పరికల్పనలకు కొత్త ఊపొచ్చే అవకాశం కనిపిస్తోంది.

Read Also: South Central Railway : రైలు ప్రయాణికులకు అలర్ట్… ప్యాసింజర్ రైళ్లకు కీలక మార్పులు..!