Ayodhya Invitation : అయోధ్య రామమందిర ఆహ్వానంపై సీపీఎం, సీపీఐ ఏమన్నాయంటే..

Ayodhya Invitation :  జ‌న‌వ‌రి 22న జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి త‌మ పార్టీ తరఫున ఎవరూ  వెళ్ల‌డం లేద‌ని సీపీఎం నేత బృందా కార‌త్ వెల్లడించారు.

  • Written By:
  • Updated On - December 26, 2023 / 05:09 PM IST

Ayodhya Invitation :  జ‌న‌వ‌రి 22న జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి త‌మ పార్టీ తరఫున ఎవరూ  వెళ్ల‌డం లేద‌ని సీపీఎం నేత బృందా కార‌త్ వెల్లడించారు. మత విశ్వాసాల‌ను తమ పార్టీ గౌరవిస్తుందని, అయితే అలాంటి మహత్తర కార్య‌క్ర‌మాన్ని రాజ‌కీయం చేయ‌డం తమకు ఇష్టం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇతర రాజకీయ పార్టీలు కూడా ఈ ప్రోగ్రాంను రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. రాజ‌కీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకే ఈ కార్యక్రమాన్ని బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు.  తాను కూడా ఆ కార్యక్రమానికి వెళ్లడం లేదని(Ayodhya Invitation) సీపీఎం నేత సీతారాం ఏచూరి తెలిపారు.

సీపీఎం నేత బృందా కార‌త్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి స్పందిస్తూ.. ‘‘ఆహ్వానాల‌ను అంద‌రికీ పంపాం. కానీ రాముడు కావాల‌నుకున్న వాళ్లే వ‌స్తారు’’ అని కామెంట్ చేశారు. రామ్‌చ‌రిత్ మాన‌స్‌లో ఉన్న ‘హ‌రి ఇచ్ఛ’ గురించి మంత్రి ప్ర‌స్తావిస్తూ ఈ వ్యాఖ్య చేశారు. ఈమేరకు మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌పై వివాదం చెల‌రేగుతోంది. సీపీఎంతో పాటు సీపీఐ కూడా జనవరి 22 అయోధ్య ఈవెంట్‌కు గైర్హాజరు కానుంది.  కాంగ్రెస్ నేత క‌పిల్ సిబల్ కూడా ఈ కార్యక్రమానికి హాజ‌రుకావ‌డం లేదు.

అయోధ్య రామమందిరం నూతన విశేషాలు

  • అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం కోసం 392 పిల్ల‌ర్లు వాడిన‌ట్లు రామ‌జ‌న్మ‌భూమి ట్ర‌స్టు జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ చంప‌త్ రాయ్ వెల్లడించారు.
  • 14 ఫీట్ల వెడ‌ల్పుతో పెర్‌కోటాను తీర్చిదిద్దామని ఆయన తెలిపారు. ఇది సుమారు 732 మీట‌ర్ల మేర ఉంటుందన్నారు.
  • ఆలయ ప్రాంగణంలోనే మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఉంటాయ‌న్నారు.
  • ఫైర్ బ్రిగేడ్ పోస్టు కూడా ఆల‌యంలో ఉంటుంద‌ని చెప్పారు. అగ్నిమాప‌క సిబ్బంది అండర్ గ్రౌండ్ రిజ‌ర్వాయ‌ర్ ద్వారా త‌మ‌కు కావాల్సిన నీటిని తీసుకుంటుంద‌ని తెలిపారు.
  • 70 ఎక‌రాలు ఉన్న ఆల‌యంలోని 70 శాతం ప్రాంతం ప‌చ్చిక‌తో నిండి ఉంటుంద‌న్నారు.
  • వృద్ధులు, దివ్యాంగుల‌కు సౌకర్యవంతంగా ఆల‌య ప్ర‌వేశం ఉంటుంద‌న్నారు. ఎంట్రెన్స్ వ‌ద్ద రెండు ర్యాంప్‌ల‌ను సిద్ధం చేస్తున్నారు.
  • అయోధ్య‌లోని కుబేర్ తిల ప్రాంతంలో జ‌ఠాయువు విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు.