Shocking Incident: గురుగ్రామ్ నుండి వెలుగులోకి వచ్చిన ఒక భయంకరమైన ఘటన మానవ సంబంధాలను సిగ్గుపడేలా చేస్తోంది. స్నేహం, నమ్మకం మధ్య మొలకెత్తిన ఈ కిరాతకం ఎవరినైనా కలచివేస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. త్రిపురకు చెందిన 19 ఏళ్ల బయోటెక్నాలజీ విద్యార్థిని, 2025 సెప్టెంబర్‌లో ఒక ఆన్‌లైన్ యాప్ ద్వారా ఢిల్లీలోని నరేలాకు చెందిన శివమ్ (19) అనే యువకుడిని కలిసింది. క్రమంగా వీరి స్నేహం ప్రేమగా మారింది. వారిద్దరూ సెక్టార్-69లోని ఒక పీజీ (PG)లో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండటం ప్రారంభించారు. ఇరు కుటుంబాల మధ్య పెళ్లి మాటలు కూడా జరుగుతున్న సమయంలో శివమ్ మనసులో మొదలైన అనుమానం ఈ బంధాన్ని నరకంగా మార్చింది. తన భాగస్వామి క్యారెక్టర్‌పై అనుమానం పెంచుకున్న నిందితుడు, ఆమెపై అమానుషమైన హింసకు పాల్పడ్డాడు.
మూడు రోజుల పాటు బందీగా ఉంచి అమానుష హింస
నిందితుడు శివమ్ తన కుమార్తెను మూడు రోజుల పాటు గదిలో బంధించి, అత్యంత క్రూరంగా ప్రవర్తించాడని బాధితురాలి తల్లి ఆరోపించారు. యువతిని తీవ్రంగా కొట్టడమే కాకుండా ఆమెతో బలవంతంగా మూత్రం తాగించాడని, శానిటైజర్‌తో ఆమె శరీర భాగాలను కాల్చాడని ఆరోపణలు వచ్చాయి. అంతటితో ఆగకుండా ఆమెపై కత్తితో దాడి చేసి, వివస్త్రను చేసి వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ కూడా చేశాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మెడికల్, ఫోరెన్సిక్ రిపోర్టులు వచ్చిన తర్వాత మరిన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read: ఈ ఎన్నికలో నాకు , స్టాలిన్‌కు మధ్య యుద్ధమే : విజయ్
ప్రాణం కాపాడిన బెంగాలీ భాష
ఈ భయానక పరిస్థితుల్లో బాధితురాలి తెలివితేటలు, ఆమె మాతృభాష ఆమె ప్రాణాలను కాపాడాయి. ఫిబ్రవరి 18 రాత్రి తనకు ఫోన్ చేసే అవకాశం దొరికినప్పుడు ఆమె తన తల్లికి బెంగాలీ భాషలో జరిగిన దారుణాన్ని వివరించింది. నిందితుడు శివమ్‌కు బెంగాలీ రాకపోవడంతో ఆమె ఏం చెబుతుందో అతనికి అర్థం కాలేదు. దీనివల్ల ఆమె తన ప్రాణాపాయం గురించి తల్లికి సమాచారం ఇవ్వగలిగింది. బాధితురాలి తల్లి స్వయంగా ఒక పోలీస్ అధికారి కావడంతో ఆమె వెంటనే గురుగ్రామ్ పోలీసులను సంప్రదించారు. పోలీసులు పీజీపై దాడి చేసి తీవ్ర గాయాలతో ఉన్న యువతిని రక్షించి, నిందితుడిని అక్కడికక్కడే అరెస్ట్ చేశారు.
న్యాయం కోసం పోరాటం – పోలీసుల కఠిన చర్యలు
నిందితుడు శివమ్‌పై అత్యాచారం, హత్యాయత్నం వంటి కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని బాధితురాలి తల్లి డిమాండ్ చేశారు. తన కుమార్తె లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్నట్లు తమకు తెలియదని ఆమె పేర్కొన్నారు. గురుగ్రామ్ పోలీసులు నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. డీసీపీ హితేష్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడి ఎలక్ట్రానిక్ పరికరాలు, చాట్ రికార్డులను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ దర్యాప్తుకు పంపారు. ఆన్‌లైన్ స్నేహాలు, భద్రతపై ఈ ఘటన మరోసారి పెద్ద ప్రశ్నలను లేవనెత్తింది.
