Onion Prices : దేశంలో ఉల్లి ధరలు మండిపోతున్నాయి. రాజధాని ఢిల్లీలో కిలో ఉల్లి ధర రూ.55 దాకా పలుకుతోంది. ఉల్లిని ముంబైలో కిలోకు రూ.58, చెన్నైలో కిలోకు రూ.60 చొప్పున రిటైల్‌లో అమ్ముతున్నారు. ఈనేపథ్యంలో ఉల్లి ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముందస్తుగా నిల్వ చేసిన 4.7 లక్షల టన్నుల ఉల్లి స్టాక్‌ను హోల్‌సేల్ మార్కెట్లోకి విడుదల చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈవిషయాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే సోమవారం వెల్లడించారు. దేశవ్యాప్తంగా రాయితీ ఉల్లిని(Onion Prices) రిటైల్‌గా విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఖరీఫ్‌లో ఉల్లి సాగు విస్తీర్ణం పెరిగినందున, ఇక ఉల్లి ధరలకు కళ్లెం పడుతుందని ఆశిస్తున్నామని చెప్పారు.
Also Read :UPI Transaction Fees : ఛార్జీలు విధిస్తే యూపీఐ లావాదేవీలు చేయబోం.. సర్వేలో సంచలన విషయాలు
ఉల్లి ఎగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ పది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టన్నుకు 550 డాలర్లుగా ఉన్న కనీస ఎగుమతి ధరను తొలగించింది. దేశంలోని ఉల్లి రైతులకు మెరుగైన ధర దక్కాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అందువల్లే ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉల్లి ఎగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసినప్పటి నుంచి ఎన్‌సీసీఎఫ్, నాఫెడ్ ద్వారా ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల రాజధానుల్లో రూ.35కే కిలో చొప్పున మొబైల్ వ్యాన్ల ద్వారా ఉల్లిని కేంద్రం విక్రయిస్తోంది. జాతీయ సగటు కంటే ఉల్లి ధర ఎక్కువగా ఉన్న నగరాల్లో రాయితీ ఉల్లి విక్రయాలు చేస్తున్నారు.
Also Read :Nitin Gadkari : నాలుగోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తామో, రామో చెప్పలేను: గడ్కరీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఈసారి ఖరీఫ్ సీజన్ ఆరంభంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనటంతో ఉల్లి సాగు విస్తీర్ణం పడిపోయింది. ఇప్పటి వరకు 20వేల 400 ఎకరాల్లోనే ఉల్లిని సాగు చేశారు. గత ఐదేళ్లలో ఈ జిల్లాలో సాగు విస్తీర్ణం ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి. మహారాష్ట్రలో జులై నెలాఖరులో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆ రాష్ట్రంలో కూడా ఉల్లి దిగుబడులు బాగా తగ్గాయి. కర్నూలు జిల్లాలోనూ దిగుబడులు తగ్గాయి. ఈ పరిణామంతో మార్కెట్‌లో తమకు లభించే ఉల్లి ధర పెరుగుతుందని రైతులు అనుకున్నారు. అయితే అలా జరగలేదు. దీంతో రైతన్నలకు నిరాశే ఎదురైంది.