Union Cabinet Accepts High Level Committee Report: ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ పై ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ సిఫార్సులను కేంద్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించిందని సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఎన్డీయే మూడోసారి గెలిచి 100 రోజులు పూర్తయిన తర్వాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఆయన తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ మార్చిలో నివేదికను సమర్పించింది.
ఈ నివేదిక చట్ట రూపం దాల్చి అమల్లోకి వస్తే, దేశంలో ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయి. మొదటి దశలో పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఇవి జరిగిన100 రోజుల తర్వాత స్థానిక సంస్థల (గ్రామ పంచాయత్, బ్లాక్, జిల్లా పంచాయత్), అలాగే పట్టణ స్థానిక సంస్థల(మున్సిపాలిటీ, మున్సిపల్ కమిటీ, మున్సిపల్ కార్పొరేషన్) ఎన్నికలు జరుగుతాయని తెలుస్తుంది.
ఈ అత్యున్నత స్థాయి కమిటీ, దేశంలోని వివిధ వర్గాలతో చర్చలు జరిపి ఈ నివేదికను రూపొందించిందని వైష్ణవ్ తెలిపారు. ”త్వరలోనే ఈ కమిటీ సిఫార్సులను ముందుకు తీసుకెళ్లేందుకు ఒక ఇంప్లిమెంట్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తాం”అని వైష్ణవ్ వెల్లడించారు. రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఈ ఉన్నత స్థాయి కమిటీ 2023 సెప్టెంబర్ 2న ఏర్పాటైనప్పటి నుంచి 191 రోజులపాటు వివిధ వర్గాలతో ఈ అంశంపై చర్చించి 18,626 పేజీల నివేదికను రూపొందించిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ‘ఒకే దేశం -ఒకే ఎన్నిక’ వల్ల ఓటర్లకు వెసులుబాటు కలుగుతుందని, వారికి అనవసర శ్రమ తగ్గుతుందని కమిటీ నివేదిక పేర్కొంది.