One Nation One Election: లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన జమిలి ఎన్నికల రెండు బిల్లులు ఇవాళ లోక్‌సభ ఎదుటకు వచ్చాయి. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులకు సంబంధించి మేఘ్వాల్ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌ను(One Nation One Election) నిర్వహించారు. 269 మంది అధికార ఎన్డీయే కూటమి ఎంపీలు దీనికి అనుకూలంగా ఓటు వేయగా, 198 మంది విపక్ష ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ ఓటింగ్ ప్రక్రియ హైబ్రిడ్ విధానంలో జరిగింది. అంటే.. కొందరు ఎంపీలు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటు వేయగా, మరికొందరు ఎంపీలు బ్యాలట్ పద్ధతిలో ఓటు వేశారు.
Also Read :MLC Kavitha : మూసీలో కూలగొట్టిన ఇళ్లకు ఈఎంఐలు చెల్లిస్తారా.. సర్కారుకు ఎమ్మెల్సీ కవిత ప్రశ్న
బిల్లులను జేపీసీకి పంపుతాం : కేంద్ర న్యాయశాఖ మంత్రి
జమిలి ఎన్నికల బిల్లులను ఏకపక్షంగా ఆమోదించుకునేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం యత్నిస్తోందని ఈసందర్భంగా విపక్ష ఎంపీలు ఆరోపించారు. ఆ బిల్లులపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. దీంతో ప్రతిపక్షాల డిమాండ్‌కు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ అంగీకరించారు. జమిలి ఎన్నికల బిల్లులను చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపేందుకు తాము సిద్ధమని ఆయన లోక్‌సభలో ప్రకటించారు. జేపీసీలో సమగ్ర చర్చ తర్వాతే ఈ బిల్లులపై తుది నిర్ణయం ఉంటుందని తేల్చి చెప్పారు.
Also Read :Allu Arjun Will Meet Pawan: పవన్‌ను కలవనున్న అల్లు అర్జున్.. షాక్ ఇవ్వనున్న పోలీసులు!
రూ.3,700 కోట్ల కోసం.. సమాఖ్య వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తారా ? : గౌరవ్ గొగోయ్, కాంగ్రెస్ ఎంపీ
అనవసర ఖర్చులను ఆపేందుకే జమిలి ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్నామని ఎన్డీయే కూటమి చేస్తున్న వాదనలో వాస్తవికత లేదని కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ గౌరవ్ గొగోయ్ అన్నారు. ‘‘ఇటీవలే మనదేశంలో లోక్‌సభ ఎన్నికలను నిర్వహించడానికి రూ.3,700 కోట్లు ఖర్చయ్యాయని కేంద్ర ఎన్నికల సంఘమే తెలిపింది. మన దేశ వార్షిక బడ్జెట్‌లో రూ.3,700 కోట్లు అనేది కేవలం 0.02 శాతానికి సమానం. ఇంత చిన్న అమౌంటు కోసం ఎన్నికల విధానాన్ని పూర్తిగా మారుస్తున్నామనే బీజేపీ వాదన నిజం కాదు’’ అని గౌరవ్ గొగోయ్ ఆరోపించారు. ‘‘కేవలం 0.02 శాతం నిధులను పొదుపు చేసేందుకు యావత్ దేశ సమాఖ్య వ్యవస్థను ఎన్డీయే సర్కారు చిన్నాభిన్నం చేయనుంది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించే పద్ధతి వల్ల కేంద్ర ఎన్నికల సంఘానికి అదనపు అధికారాలు దక్కుతాయి’’ అని ఆయన పేర్కొన్నారు.