Golden Temple: పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో ఉన్న ప్రఖ్యాత గోల్డెన్ టెంపుల్ లో దొంగలు పడిన ఘటన సంచలనంగా మారింది. ఆలయంలోని కౌంటర్ నుంచి దుండగులు లక్షరూపాయలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆలయంలో చోరీ జరగడంపై సమాచారం అందుకున్న పోలీసులు.. నలుగురు అనుమానితులపై కేసు నమోదు చేశారు.
గురునానక్ జయంతికి ఒకరోజు ముందు అనగా.. ఆదివారం ఈ ఘటన జరగ్గా.. చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ మేరకు గోల్డెన్ టెంపుల్ ఉద్యోగులు, సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేయాలని ఆలయ సిబ్బంది కోరగా.. ఆలయంలో పనిచేసే నలుగురు అనుమానితులపై కేసు నమోదు చేశారు. అక్కడి సిబ్బంది సైతం వారిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ప్రతి ఏటా వేలాదిమంది భక్తులు సందర్శించే ఈ ఆలయంలో దొంగతనం జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.