Manipur Violence : మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో సోమవారం మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 11 మంది సాయుధులు మృతిచెందారు. స్థానిక పోలీస్ స్టేషన్ ,అనేక దుకాణాలపై కుకీ తిరుగుబాటుదారులు దాడి చేయడంతో వెంటనే స్పందించిన బలగాలు కాల్పులను తిప్పికొట్టాయి. దాంతో జిరిబామ్ జిల్లాలో అశాంతి నెలకొల్పాలని చూసిన మిలిటెంట్లు హతమయ్యారని అధికారులు తెలిపారు. అయితే మిలిటెంట్లుతో జరిగిన ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ కూడా గాయపడగా.. చికిత్స నిమిత్తం విమానంలో అతడ్ని ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఇటీవల మెయితీ వర్గానికి చెందిన రైతులు, వ్యవసాయ కూలీలను లక్ష్యంగా చేసుకొని కుకీ మిలిటెంట్లు దాడులకు దిగుతున్నారు. తాజాగా సోమవారం ఉదయం ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఓ ఊరిలో ఉన్న పొలంలో పనిచేస్తున్న రైతులపై సాయుధ దుండగులు కాల్పులు జరిపారు. ఆ పొలాల పక్కనే ఉన్న కొండపై నుంచి ఫైరింగ్ చేశారని గుర్తించారు. దీంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని ప్రతికాల్పులు జరపడంతో మిలిటెంట్లు వెనక్కి తగ్గారు. ఒక రైతుకు గాయాలు కావడంతో సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. గత శనివారం రోజు బిష్ణుపూర్ జిల్లాలో ఇదే విధంగా మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో 34 ఏళ్ల మహిళా రైతు చనిపోయింది.
Read Also: KTR : ఇప్పుడే ఢిల్లీకి వచ్చా..అప్పుడే హైదరాబాద్‌లో ప్రకంపనలు..