Parliament: దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని పార్లమెంట్ భవనం వద్ద శుక్రవారం ఉదయం ఓ భద్రతా ఉల్లంఘన చోటుచేసుకుంది. అత్యంత భద్రతా చర్యలు అమలు చేస్తున్న ప్రాంతంలోనే ఒక చొరబాటుదారుడు చెట్టు ఎక్కి, గోడ దూకి పార్లమెంట్ ప్రాంగణంలోకి ప్రవేశించడం కలకలం రేపింది. ఈ ఘటన ఉదయం 6.30 గంటల సమయంలో చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. చొరబాటుదారుడు రైలు భవన్ వైపు నుంచి గోడ దూకి, కొత్త పార్లమెంట్ భవనం ప్రధాన ప్రవేశ ద్వారం అయిన గరుడ గేట్ వద్దకు చేరుకున్నాడు. అయితే, అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తంగా స్పందించి, వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Read Also: Chiru Birth Day : జన సైన్యాధ్యక్షుడికి విజయోస్తు అంటూ పవన్ కు చిరంజీవి రిప్లయ్
ఇది సాధారణ సంఘటన కాదు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. జులై 21న ప్రారంభమైన సమావేశాలు ఇటివలే ముగిశాయి. ఈ నేపథ్యంలో భద్రతా లోపంపై తీవ్ర చర్చ మొదలైంది. ఇది మొదటి సారి కాదు. గతంలో కూడా పార్లమెంట్ భవనంలో భద్రతా లోపాలు పలు మార్లు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా, 2023 డిసెంబరు 13న, పార్లమెంట్ భవనంపై జరిగిన ఉగ్రదాడికి 22 ఏళ్లు పూర్తయిన రోజునే, మరో సంచలనాత్మక ఘటన చోటుచేసుకుంది. ఆ రోజు లోక్‌సభ సమావేశం జరుగుతున్న సమయంలో, ఇద్దరు యువకులు పబ్లిక్ గ్యాలరీ నుంచి సభ లోపలికి దూకి రంగుల పొగలు విడిచిన ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. అదే సమయంలో పార్లమెంట్ భవనానికి వెలుపల కూడా ఇద్దరు వ్యక్తులు అదే తరహా నిరసన ప్రదర్శనలో పాల్గొనడం గమనార్హం. ఈ ఘటన తర్వాత పార్లమెంట్ భద్రతను మరింత కఠినంగా మార్చినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, గతేడాది ఆగస్టులో కూడా ఓ యువకుడు పార్లమెంట్ గోడ దూకి లోపలికి చొరబడేందుకు యత్నించాడు. పోలీసులు అతడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనీష్‌గా గుర్తించారు.
అయితే అతడి వద్ద ఎలాంటి హానికర వస్తువులు లభించకపోవడంతో, ఆయన మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ తరహా వరుస సంఘటనలు పార్లమెంట్ భద్రతపై అనేక అనుమానాలు తలెత్తిస్తున్నాయి. దేశ అత్యంత రక్షిత ప్రాంతాల్లో ఒకటిగా పేరుగాంచిన పార్లమెంట్ ప్రాంగణంలో ఇలాంటి చొరబాట్లు జరుగుతుండటం భద్రతా వ్యవస్థలలో లోపాలు ఉన్నాయనే అనుమానాలకు తావిస్తోంది. పార్లమెంట్ ప్రాంగణం చుట్టూ సీసీ టీవీలు, మెటల్ డిటెక్టర్లు, మల్టీ లేయర్డ్ భద్రతా వ్యవస్థలు ఉండగా, చొరబాటుదారులు ఇలాగే లోపలికి ప్రవేశించడం రాష్ట్రపతి భవన్, ప్రధాని నివాసం వంటి కీలక ప్రాంతాల భద్రతపైనా ప్రశ్నలు సృష్టిస్తోంది. తాజా ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. చొరబాటుదారుడి ఉద్దేశ్యం ఏమిటి? అతడు ఒంటరిగా పనిచేశాడా? లేదా ఎవరి ప్రేరణతో వచ్చాడన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఈ నేపథ్యంలో భద్రతా పరిరక్షణపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ, పార్లమెంట్ భద్రతా విభాగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దేశ ప్రజల విశ్వాసానికి కేంద్రస్థానంగా నిలిచే పార్లమెంట్‌కు మరింత రక్షణ అవసరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.