MLAs Nomination : జమ్మూకశ్మీర్ కాబోయే ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ నుంచి కశ్మీర్ అసెంబ్లీకి సభ్యులను నామినేట్ చేయొద్దని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జీ) మనోజ్ సిన్హాను ఆయన కోరారు. విపక్షంలో ఉండే పార్టీ నుంచి సభ్యులను అసెంబ్లీకి నామినేట్ చేస్తే.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ తలెత్తుతుందని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఒకవేళ బీజేపీ నాయకులను (MLAs Nomination) లెఫ్టినెంట్ గవర్నర్ అసెంబ్లీకి నామినేట్ చేస్తే.. తమ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని హెచ్చరించారు. అలాంటి పరిణామాల వల్ల జమ్మూకశ్మీర్, కేంద్ర ప్రభుత్వం మధ్య సంబంధాలు దెబ్బతింటాయన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు దెబ్బతినాలని తాము కోరుకోవడం లేదని ఒమర్ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ పురోగతి కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం తమకు అవసరమని చెప్పారు.
‘‘జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఐదుగురు బీజేపీ వాళ్లను నామినేట్ చేసినంత మాత్రాన ఏం జరుగుతుంది ? ఏమీ కాదు. అసెంబ్లీలో లెక్కలేం మారవు. అందుకే బీజేపీ వాళ్లను నామినేట్ చేయాలనే ఆలోచనను లెఫ్టినెంట్ గవర్నర్ మానుకోవాలి’’ అని ఒమర్ సూచించారు. తమ ప్రభుత్వంతో సంప్రదించి అలాంటి విషయాలపై లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందన్నారు. కశ్మీరు ఎన్నికల్లో గెలిచిన స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే తమ కూటమిలో చేరే అవకాశం ఉందని ఒమర్ తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ – నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి 49 సీట్లు వచ్చాయి. బీజేపీ 29 సీట్లకు పరిమితమైంది. బుడ్గాం, గండేర్ బల్ అసెంబ్లీ స్థానాల నుంచి ఒమర్ అబ్దుల్లా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే వీటిలో ఏదో స్థానంలోనే ఆయన ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు. మరో స్థానానికి రాజీనామా సమర్పించనున్నారు. ఆ విధంగా ఖాళీ అయ్యే స్థానానికి ఎన్నికల సంఘం ఉప ఎన్నికను నిర్వహించనుంది.