Kashmir CM : నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా కీలక ప్రకటన చేశారు. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు చేపడతారని వెల్లడించారు. నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ పార్టీలతో కూడిన కూటమి కశ్మీరులో ఏర్పాటు చేయబోయే సంకీర్ణ ప్రభుత్వానికి ఒమర్ సారథ్యం వహిస్తారని ఆయన స్పష్టం చేశారు. ‘‘2019 సంవత్సరం ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అది తప్పుడు నిర్ణయమని, దాన్ని తాము సమర్ధించబోమని ఈ ఎన్నికల ఫలితం ద్వారా జమ్మూకశ్మీర్ ప్రజలు తేల్చి చెప్పారు’’ అని ఫరూక్ అబ్దుల్లా(Kashmir CM) పేర్కొన్నారు. ‘‘ఈ ఎన్నికల్లో మా కూటమికి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. కశ్మీరులో నిరుద్యోగాన్ని అంతం చేస్తాం. ద్రవ్యోల్బణం, డ్రగ్స్ సమస్యలను పరిష్కరిస్తాం. ఇకపై లెఫ్టినెంట్ గవర్నర్, ఆయన సలహాదారులు ఉండరు. కశ్మీరీ ప్రజల కోసం 90 మంది ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పనిచేస్తారు. కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి సాధించేందుకు మేం పోరాటాన్ని కొనసాగిస్తాం’’ అని ఆయన చెప్పారు.
Also Read :Airtel – Tata Play : జియోతో ఢీ.. ‘టాటా ప్లే’ను కొనేందుకు ఎయిర్‌టెల్ చర్చలు
ఒమర్ అబ్దుల్లా ఈ ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు. బద్గాం అసెంబ్లీ స్థానంలో పీడీపీ అభ్యర్థి ఆగా సయ్యద్ ముంతజీర్ మెహ్దీపై 18వేలకుపైగా ఓట్ల తేడాతో ఒమర్ అబ్దుల్లా గెలిచారు. ఇక గండేర్ బల్ స్థానంలోనూ ఆయన విజయఢంకా మోగించారు. ఈ స్థానం అబ్దుల్లా కుటుంబానికి కంచుకోట. కశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. హంగ్ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన జోస్యం నిజం కాలేదు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ కాంగ్రెస్ – నేషనల్ కాన్ఫరెన్స్ సంకీర్ణ సర్కారు ఏర్పాటైంది. అయితే బీజేపీ ఈ ఎన్నికల్లో బాగానే పుంజుకొని 29 అసెంబ్లీ సీట్లను గెల్చుకుంది. ఒకప్పుడు కశ్మీరులో ఎంతో బలంగా ఉన్న పీడీపీ కేవలం 3 సీట్లకే పరిమితమైంది. దీంతో ఆ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీకి షాక్ తగిలినట్లయింది. బీజేపీకి బీ టీమ్ అంటూ జరిగిన ప్రచారం వల్ల పీడీపీ దెబ్బతిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.