Site icon HashtagU Telugu

Gas Price : వంటింటికి కేంద్రం శుభవార్త! లీటరు నూనె ధర ఎంత తగ్గుతుందంటే..!

LPG Cylinders

14 Kg Lpg Gas Cylinder Price Today

హమ్మయ్య! అసలే ధరలు పెరిగి ఏమీ తినలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ఆ ధరలను కాస్తయినా తగ్గించే చర్యలను కేంద్రం చేపట్టడం ఉపశమనం కలిగించే విషయమే. దీనికి అనుగుణంగా వంటనూనెల దిగుమతులపై కస్టమ్స్ , సెస్ లను తొలగించింది. ఈ చర్యల వల్ల వంట నూనె ధరలు కొద్దిగా దిగివస్తాయి. ఏడాదికి 20 లక్షల మెట్రిక్ టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ తో పాటు ఇంకో 20 లక్షల మెట్రిక్ టన్నుల సోయాబీన్ నూనెల దిగుమతిపై ఈ సుంకాలను తగ్గించింది.

కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల లీటరు నూనె ధర దాదాపు రూ.3లు తగ్గుతుంది. ఎందుకంటే.. ఇప్పుడు వంటనూనెలపై కస్టమ్స్ సుంకంతోపాటు వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్ పేరుతో 5.5 శాతం వసూలు చేస్తున్నారు. ఇప్పుడీ సుంకాల రద్దు వల్లే లీటరుకు రూ.3 తగ్గుతుందంటున్నాయి పారిశ్రామిక వర్గాలు. ఈ ఆర్థిక సంవత్సరంలో 35 లక్షల టన్నుల ముడి సోయాబీన్ నూనెతోపాటు 16-18 లక్షల టన్నుల ముడి పొద్దుతిరుగుడు నూనెలను ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది.

పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం తగ్గించడం, పెట్రోల్-డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని కూడా తగ్గించడం వల్ల కొంతమేర ఉపశమనం కలిగింది. ఇప్పుడీ పన్నుల రద్దు వల్ల మరికొంతమేర ధరలు తగ్గుతాయి. ఈ పన్ను తగ్గింపు వెసులుబాటు 2024 మార్చి 31వరకు.. 80 లక్షల మెట్రిక్ టన్నుల నూనెల దిగుమతికి వర్తిస్తుంది. ఇప్పుడీ నూనె ధరల తగ్గింపు వల్ల ద్రవ్యోల్బణం కొంతయినా అదుపులోకి వస్తుందని కేంద్రం భావిస్తోంది. అటు పంచదార ఎగమతులపైనా పరిమితులు విధించింది. ఈ సంవత్సరంలో 10 మిలియన్ టన్నులకే పరిమితం చేసింది. ఈ నిర్ణయం జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. పంచదార ఎగుమతులపై ఇలా ఆంక్షలు విధించడం గత ఆరేళ్లలో ఇదే తొలిసారి.