Site icon HashtagU Telugu

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ.. స్పష్టం చేసిన కేంద్ర రైల్వే మంత్రి

Odisha Train Accident case gives to CBI Central Railway Minister Ashwini Vaishnaw Said

Odisha Train Accident case gives to CBI Central Railway Minister Ashwini Vaishnaw Said

ఒడిశా(Odisha)లోని బాలేశ్వ‌ర్ జిల్లాలో శుక్ర‌వారం రాత్రి ఘోర రైలు ప్ర‌మాదం(Train Accident) జ‌రిగిన విష‌యం విధిత‌మే. ఈ ప్ర‌మాదంలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆదివారం రైల్వే అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. 275 మంది దుర్మ‌ర‌ణం చెందారు. 1,175 మందికిపైగా గాయాల‌పాల‌య్యారు. వీరిలో మ‌రో 100 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. రైల్వే చ‌రిత్ర‌లోనే ఘోర ప్ర‌మాదం ఇదేన‌ని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ఈ ఘోర రైలు ప్ర‌మాదానికి డ్రైవ‌ర్(Driver) త‌ప్పిదం లేక‌పోవ‌చ్చ‌ని, అతివేగం కాద‌ని రైల్వేశాఖ పేర్కొంటుంది. ఎల‌క్ట్రానిక్ ఇంట‌ర్ లాకింగ్ వ్య‌వ‌స్థ స‌రిగ్గానే ఉన్న‌ప్ప‌టికీ అందులో ఎవ‌రో ట్యాంప‌రింగ్‌కు పాల్ప‌డ్డార‌నే అనుమానాలు వ్య‌క్తమ‌వుతున్నాయి.

ఈ ఘోర రైలు ప్ర‌మాదంపై సోష‌ల్ మీడియాలో నిరాధార పోస్టులు పెట్ట‌డం, పుకార్లు వ్యాప్తిచేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు హెచ్చ‌రించారు. మ‌రోవైపు సిగ్న‌లింగ్‌లో స‌మ‌స్య కార‌ణంగానే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలిన‌ట్లు రైల్వే బోర్డు స‌భ్యురాలు జ‌య‌వ‌ర్మ సిన్హా ఆదివారం వెల్ల‌డించారు. రైల్వే సేప్టీ క‌మిష‌న‌ర్ నుంచి పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉంద‌ని చెప్పారు.

రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. రైల్వే మంత్రి అశ్వ‌నీ వైష్ణ‌వ్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్ర‌మాదం వెనుక మాన‌వ త‌ప్పిదం ఉంద‌నే ఆరోప‌ణ‌లు కూడా వెల్లువెత్తుతున్నాయి. తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో కేంద్ర రైల్వే శాఖ నిజానిజాల‌ను నిగ్గుతేల్చేందుకు కేసును సీబీఐకి అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఆదివారం రాత్రి భువ‌నేశ్వ‌ర్‌లో రైల్వే మంత్రి అశ్వ‌నీ వైష్ణ‌వ్ మీడియాతో మాట్లాడుతూ.. రైల్వే ప్ర‌మాదంపై విచార‌ణ‌ను సీబీఐకి అప్ప‌గించాల‌ని ఇండియ‌న్ రైల్వే బోర్డు నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు.