Tamil Nadu Temples : హిందూ ఆలయాల్లోకి ఇతర మతస్థుల ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు రాష్ట్రంలోని దేవాలయాల్లోకి హిందూయేతరులను ఆయా పుణ్యక్షేత్రాల ధ్వజస్తంభం దాటి అనుమతించరాదని స్పష్టం చేసింది. హిందువులకు కూడా తమ మతాన్ని అభ్యసించే ప్రాథమిక హక్కు ఉందని పేర్కొంటూ ఆలయాల్లో డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. ఆలయ ప్రవేశ ద్వారం, ధ్వజస్తంభం దగ్గర, మందిరంలోని ప్రముఖ ప్రదేశాల్లో ‘హిందూయేతరులకు అనుమతి లేదు’ అనే బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ మేరకు మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ ఎస్ శ్రీమతి ఆర్డర్స్ ఇచ్చారు.
ఏమిటీ కేసు ?
అరుల్మిగు పళని దండాయుతపాణి స్వామి ఆలయం, దాని ఉప ఆలయాల్లోకి(Tamil Nadu Temples) హిందువులను మాత్రమే అనుమతించేలా ప్రతివాదులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డి సెంథిల్‌కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించే సందర్భంగా మద్రాస్ హైకోర్టు పైవిధంగా వ్యాఖ్యలు చేసింది. ‘‘దేవాలయం పిక్నిక్ స్పాట్ కాదు. హిందూ ఆలయంలోకి హిందువులు కాని వారిని అనుమతించొద్దు’’ అని పేర్కొంది. ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా తమిళనాడు ప్రభుత్వం తరఫున పర్యాటక, సాంస్కృతిక, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, పళని ఆలయ కార్యనిర్వాహక అధికారిని చేర్చారు. తమిళనాడులోని హిందూ ఆలయాలను పర్యాటక, సాంస్కృతిక, దేవాదాయ శాఖ పర్యవేక్షిస్తుంటుంది.
We’re now on WhatsApp. Click to Join
హిందూయేతరులకు ఆ షరతు..
‘‘హిందూ మతాన్ని విశ్వసించని వారిని, హిందువులు కానివారిని ఆలయం లోపలికి అనుమతించవద్దని ప్రతివాదులకు సూచించాం.. ఎవరైనా హిందూయేతరులు ఆలయంలో నిర్దిష్ట దేవతను దర్శించుకుంటామని కోరితే దేవతపై విశ్వాసం, హిందూ మతం ఆచారాలు, సంప్రదాయాలను అనుసరిస్తానని ఆలయ ఆచారాలకు కూడా కట్టుబడి ఉంటానని వారి నుంచి హామీని పొందాలి. అటువంటి హామీతో హిందుయేతరులను ఆలయాన్ని సందర్శించడానికి అనుమతించవచ్చు. అటువంటి వ్యక్తులను అనుమతించినప్పుడల్లా ఆలయ రిజిస్టర్‌లో పేరు నమోదు చేయాలని స్పష్టం చేసింది’’ అని తీర్పులో కోర్టు పేర్కొంది. ఈ పిటిషన్ పళని దేవాలయానికి సంబంధించి మాత్రమే దాఖలైనందున కోర్టు ఉత్తర్వులను దానికి మాత్రమే పరిమితం చేయాలని ప్రతివాదులు వినిపించిన వాదనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘ఈ అంశం పెద్ద సమస్య.. ఇది అన్ని హిందూ దేవాలయాలకు వర్తించాలి.. కాబట్టి ప్రతివాదుల అభ్యర్థన తిరస్కరించాం.. ఈ ఆంక్షలు వివిధ మతాల మధ్య మత సామరస్యాన్ని.. సమాజంలో శాంతిని నిర్ధారిస్తాయి’’ అని కోర్టు పేర్కొంది.