Shahi Idgah Complex : శ్రీకృష్ణ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఆ సర్వేపై స్టే

Shahi Idgah Complex : ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

  • Written By:
  • Updated On - January 16, 2024 / 05:29 PM IST

Shahi Idgah Complex : ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మథురలోని షాహీ ఈద్గా మసీదును సర్వే చేసేందుకు కమిషనర్​ను నియమిస్తూ అలహాబాద్ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలపై  దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి విచారణ జరిగే దాకా సర్వే చేయొద్దని ఆర్డర్ ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ షాహీ ఈద్గా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్లపై స్పందన తెలియజేయాలని హిందూ సంఘాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సర్వే కోసం కమిషనర్​ను నియమించాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​పై చట్టపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని, అస్పష్టమైన దరఖాస్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేవలం ఆదేశాలపైనే అత్యున్నత న్యాయస్థానం స్టే విధించిందని, అలహాబాద్​ హైకోర్టులో విచారణ కొనసాగుతుందని హిందూ వర్గం తరఫు న్యాయవాది రీనా ఎన్ సింగ్ మీడియాకు తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ జనవరి 23న జరగుతుందని(Shahi Idgah Complex) చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో మొఘల్ చక్రవర్తుల కాలంలో షాహీ ఈద్గా మసీదును నిర్మించారు. అయితే శ్రీకృష్ణుడు జన్మించిన స్థలంలో షాహీ ఈద్గా నిర్మించారని, దీనిపై సర్వే చేయించాలని కోరుతూ మథుర జిల్లా కోర్టులో చాలా ఏళ్ల క్రితం 9 పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో వాటిని మథుర జిల్లా కోర్టు నుంచి అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేశారు. ఆ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు..  న్యాయస్థానం పర్యవేక్షణలో షాహీ ఈద్గాలో సర్వే నిర్వహించేందుకు  అడ్వకేట్‌ కమిషనర్‌ను నియమించేందుకు అనుమతిస్తూ గతేడాది డిసెంబరు 14 ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను మసీదు కమిటీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఆదేశాల అమలుపై తాజాగా స్టే ఇచ్చింది.

Also Read: MLC Candidates : ఆ ఆరుగురిలో ఇద్దరికి ఛాన్స్.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక జరిగిందిలా..

ఇక వారణాసిలోని జ్ఞానవాపి మసీదు విషయంలోనూ ఒక కేసు నడుస్తోంది. హిందూ ఆలయం స్థానంలో మసీదును నిర్మించారని హిందూ సంఘాలు వాదిస్తున్నాయి. మసీదులో శివలింగం ఉన్న ‘వజుఖానా’ ప్రాంతాన్ని శుభ్రపరిచి, అక్కడ పరిశుభ్రత పాటించేలా ఆదేశాలివ్వాలంటూ హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీం ధర్మాసనం విచారణకు అనుమతించింది. వజుఖానాను శుభ్రం చేయించేందుకు కోర్టు అంగీకరించింది. అయితే దాన్ని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ పర్యవేక్షణలో శుభ్రపరచాలని ఆదేశించింది.