Cyrus Mistry : సైర‌స్ మిస్త్రీ హ‌ఠాన్మ‌రణం గురించి మరిన్ని వివరాలు వెలుగులోకి..

  • Written By:
  • Publish Date - September 5, 2022 / 04:16 PM IST

రోడ్డు ప్ర‌మాదంలో టాటా స‌న్స్ మాజీ చైర్మ‌న్ సైర‌స్ మిస్త్రీ హ‌ఠాన్మ‌ర‌ణానికి సంబంధించిన ఒక్కో విషయం ఆలస్యంగా వెలుగుచూస్తోంది. తొలుత అదొక రోడ్డు ప్రమాదం అనే విషయం బయటకు రాగా.. ఆ తర్వాత ప్రమాద సమయంలో కారును ఎవరు నడిపారు? అనేది తెలిసింది.మిస్త్రీ ప్ర‌యాణిస్తున్న మెర్సిడెస్ కారును ముంబైకి చెందిన ప్రముఖ గైన‌కాల‌జిస్ట్, బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ వైద్య నిపుణురాలు అన‌హిత పండోలే (55) న‌డిపార‌ని పోలీసులు గుర్తించారు.

కారులో ఆ నలుగురు..

కారులో సైరస్ మిస్త్రీ తో పాటు అన‌హిత పండోలే, డెరియస్ పండోలే (అన‌హిత పండోలే భర్త), జహంగీర్ పండోలే (డెరియస్ పండోలే తమ్ముడు) ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీళ్ళు నలుగురు కూడా బాల్య స్నేహితులు. పాఠశాల దశలో ముంబైలోని కెథడ్రల్ అండ్ జాన్ క్యానన్ స్కూల్ లో కలిసి చదువుకున్నారు. గుజరాత్ లోని ఉడవడలో ఉన్న ప్రఖ్యాత పార్షీ అగ్ని ఆలయం ” ఇరాన్ షా ఫైర్ టెంపుల్” ను గత ఏడాది సైరస్ మిస్త్రీ కుటుంబం పునర్నిర్మాణం చేయించింది. డెరియస్ పండోలే,సైరస్ మిస్త్రీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. దీంతో ఇద్దరూ కలిసి ” ఇరాన్ షా ఫైర్ టెంపుల్” దర్శనం కోసం మెర్సిడెస్ కారులో గుజరాత్ లోని ఉడవడకు వెళ్లారు. దర్శనం ముగించుకొని ముంబైకి బయలుదేరారు.

9 నిమిషాల్లోనే 20 కిలోమీటర్లు..

పాల్ ఘర్ జిల్లాలో ఉన్న చెక్ పోస్ట్ నుంచి 20 కిలోమీటర్ల దూరాన్ని కారులో కేవలం 9 నిమిషాల్లోనే దాటినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇలా వేగంగా ప్రయాణించిన కారు సూర్య నది వంతెనపైకి చేరుకోగానే రోడ్డు డివైడర్ ను వేగంగా ఢీ కొట్టింది. దీంతో కారు వెనుక సీటులో కూర్చొని ఉన్న సైరస్ మిస్త్రీ, జహంగీర్ పండోలే అక్కడికక్కడే చనిపోయారు. వీరు సీటు బెల్టు ధరించలేదని గుర్తించారు.ఇక కారు నడిపిన అన‌హిత పండోలే , ఆమె భర్త డెరియస్ పండోలే తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఇక ఎడమ వైపు నుంచి వచ్చిన మరో కారును ఓవర్ టేక్ చేసేందుకు అన‌హిత పండోలే ప్రయత్నించారని ..ఈక్రమంలోనే కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టినట్టు వెల్లడైంది.