Pant Accident: తప్పు మీదే.. కాదు మీది పంత్ యాక్సిడెంట్‌పై మాటల యుద్ధం

క్రికెటర్ రిషబ్ పంత్‌ కారు ప్రమాదానికి రోడ్డుపై గుంతే కారణమా..? ఉత్తరాఖండ్ సీఎం ధామి, డీడీసీఏ ఛైర్మన్‌ చేసిన వ్యాఖ్యలు వింటే ఔననే సమాధానమే వస్తోంది.

  • Written By:
  • Publish Date - January 3, 2023 / 10:43 PM IST

క్రికెటర్ రిషబ్ పంత్‌ కారు ప్రమాదానికి రోడ్డుపై గుంతే కారణమా..? ఉత్తరాఖండ్ సీఎం ధామి, డీడీసీఏ ఛైర్మన్‌ చేసిన వ్యాఖ్యలు వింటే ఔననే సమాధానమే వస్తోంది. అయితే జాతీయ రహదారుల విభాగం ఈ ఆరోపణలను ఖండించింది. టీమిండియా క్రికెటర్‌ రిషబ్ పంత్‌ కారు ప్రమాదం.. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం, నేషనల్ హైవే అథారిటీ మధ్య డైలాగ్‌ వార్‌కు దారితీసింది.

జాతీయ రహదారిపై ఉన్న గుంత కారణంగానే ప్రమాదం జరిగిందన్న సీఎం పుష్కర్ సింగ్ ధామి వ్యాఖ్యలను ఖండించారు NHAI రూర్కీ డివిజన్ ప్రాజెక్ట్‌ డైరెక్టర్ ప్రదీప్ సింగ్. పంత్ కారు ప్రమాదానికి గురైన మార్గంలో ఎలాంటి గుంతలు లేవని స్పష్టంచేశారు. రాజవాహ్‌ నది ఉండడం వల్ల రోడ్డు కొంచెం ఇరుక్కా ఉందని తెలిపారు. గుంతలకు మరమ్మతులు చేసి పూడ్చినట్లు వచ్చిన వార్తలను NHAI తోసిపుచ్చింది .

కారు ప్రమాదంలో గాయపడి.. డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రిషబ్ పంత్‌ను ఇటీవల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ధామి పరామర్శించారు . నేషనల్ హైవేపై ఓ గుంతను తప్పించబోయి ప్రమాదానికి గురైనట్టు పంత్ చెప్పాడన్నారు. డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ శర్మ కూడా యాక్సిడెంట్‌కు కారణం రోడ్డుపై గుంతే అని చెప్పుకొచ్చారు. అయితే అసలు హైవేపై గుంతలే లేవని జాతీయ రహదారుల శాఖ అంటోంది. డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తూ.. రూర్కీ వద్ద ప్రమాదానికి గురైంది రిషబ్ పంత్ కారు.

డివైడర్‌ను ఢీకొట్టి ..మంటల్లో చిక్కుకుంది. మెర్సిడిజ్‌లో సింగిల్‌గా వెళ్తున్న పంత్‌.. నార్సాన్ ప్రాంతానికి కిలోమీటరు ముందు నిద్రలోకి జారుకున్నాడని.. అదే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. సీఎం ప్రకటన మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ హాస్పిటల్‌లో రిషబ్ పంత్‌కు చికిత్స కొనసాగుతోంది. డాక్టర్లు ప్రైవేటు వార్డులో ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు .