Presidential election 2022: రాష్ట్ర‌ప‌తి `రేస్` లో నార్త్‌, సౌత్‌!

రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలో ఉత్త‌ర‌, ద‌క్షిణ భార‌త‌దేశం అనే భావాన్ని స‌మ‌తుల్యం చేయాల్సి ఉంటుంది.

  • Written By:
  • Publish Date - May 28, 2022 / 06:00 PM IST

రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలో ఉత్త‌ర‌, ద‌క్షిణ భార‌త‌దేశం అనే భావాన్ని స‌మ‌తుల్యం చేయాల్సి ఉంటుంది. గ‌తంలోనూ ప‌లుమార్లు అదే జ‌రిగింది. ఒక వేళ రాష్ట్ర‌ప‌తి ద‌క్షిణ భార‌త‌దేశానికి ఇస్తే ఉత్త‌ర భార‌త‌దేశానికి ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విని ఇస్తారు. అదే ఉత్త‌ర‌భార‌త‌దేశం నుంచి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిత్వాన్ని ఎంపిక చేస్తే ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి ద‌క్షిణ భార‌త‌దేశానికి వ‌స్తుంది. అంతేకాదు, కులం, మ‌తం ఈక్వేష‌న్ కూడా ఈసారి చూసే అవ‌కాశం ఉంది. మ‌త‌త‌త్త్వ పార్టీకి బీజేపీకి బ‌ల‌మైన ముద్ర ఉంది. అగ్ర‌వ‌ర్ణాల పార్టీగా కూడా ఆ పార్టీపై ఉన్న ప్ర‌చారం. ప్ర‌ధానంగా బ్రాహ్మ‌ణ సామాజిక‌వ‌ర్గం న‌డిపే పార్టీగా మోడీ ప్ర‌ధాన మంత్రి అయ్యే వ‌ర‌కు ముద్ర ఉండేది. మోడీ రూపంలో ఆ పార్టీ బ్రాహ్మ‌ణ ముద్ర నుంచి కొంత మేర‌కు బ‌య‌ట‌ప‌డింది. రాష్ట్ర‌ప‌తిగా కోవింద్ ను ఎంపిక చేయ‌డం ద్వారా ద‌ళితుల‌కు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేసింది. ఇక హిందుత్వ ముద్రను తుడిపేసుకోవాలంటే ముస్లింకు రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిత్వాన్ని క‌ట్ట‌బెట్టాలి. అదే జ‌రిగితే, ఉత్త‌ర‌భార‌తానికి ఆ ప‌ద‌వి వెళ్లే అవ‌కాశాలు ఎక్కువ.

ఒక వేళ ద‌క్షిణ భార‌తానికి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిత్వాన్ని ఇవ్వాల‌ని భావిస్తే ప్ర‌స్తుతం ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు మిన‌హా మ‌రో ప్ర‌త్యామ్నాయం బీజేపీకి లేదు. పైగా ఆయ‌న అభ్య‌ర్థిత్వాన్ని టీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ అంగీక‌రించే అవ‌కాశం ఉంది. ఎన్డీయే అభ్య‌ర్థికి కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల్లోని ఆప్, టీఎంసీ, టీఆర్ఎస్, వైసీపీ, బీజేడీల్లో ఒక‌దాని మ‌ద్ధ‌తు ఉంటే చాలు విజ‌యం వ‌రిస్తుంది. అందుకే, ద‌క్షిణ భార‌త దేశం ఈక్వేష‌న్ తెర‌పైకి వ‌స్తే టీఆర్ఎస్, వైసీపీ మ‌ద్ధ‌తు ఇచ్చేందుకు ఛాన్స్ ఉంది. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎలక్టోరల్ కాలేజీ మొత్తం ఓటు విలువ 1093347. ప్రస్తుతం, మొత్తం ఎలక్టోరల్ కాలేజీ మొత్తం ఓట్ల విలువలో NDA 48.8 శాతం కలిగి ఉంది. రాష్ట్ర‌ప‌తి ఎన్నికల్లో గెలవాలంటే అభ్యర్థికి మొత్తం ఓట్ల విలువలో కనీసం 50 శాతం అవసరం. అంటే, కేవ‌లం 1.2శాతం ఓటు విలువ మాత్ర‌మే ఎన్డీయేకి కావాలి. అందుకే, ఆప్‌కి 1 శాతం, టీఎంసీకి 3.05 శాతం, వైఎస్సార్‌సీపీకి 4 శాతం, టీఆర్‌ఎస్‌కు 2.2 శాతం, బీజేడీకి 3 శాతం ఉన్న ఏదో ఒక‌దాని మ‌ద్ధ‌తు ఎన్డీయేకి అనివార్యం. తృణమూల్ కాంగ్రెస్ (TMC), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), తెలంగాణ రాష్ట్ర సమితి (TRS), YSR కాంగ్రెస్ పార్టీ (YSRCP), మరియు బిజూ జనతాదళ్ (BJD) మొత్తం ఓట్ల విలువలో గణనీయమైన వాటాలను కలిగి ఉన్న ప్రాంతీయ పార్టీలు. కాషాయ పార్టీతో సైద్ధాంతిక విభేదాల ఉన్న వాటిలో ఆప్, టిఎంసి మరియు టిఆర్ఎస్ ప్ర‌ముఖంగా క‌నిపిస్తున్నాయి. ఆ పార్టీలు బిజెపి రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశం త‌క్కువ‌. అందుకే, వైసీపీ, బీజేడీల్లో ఏదో ఒక‌దాని మ‌ద్ద‌తు తీసుకునే ప్ర‌య‌త్నం ఎన్డీయే చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు కూడా, పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం మరియు ఆర్టికల్ 370 రద్దు సమయంలో YSRCP మరియు BJP బీజేపీకి మద్దతు ఇచ్చాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి లేదా నవీన్ పట్నాయక్ సహాయం తీసుకోవడం అనివార్యం.

గ‌త ఎన్నిక‌ల్లో ఉత్తరప్రదేశ్ నుంచి BJP దాని మిత్రపక్షం అప్నాదళ్ క‌లిసి 323 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నాయి. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, NDA బలం 273కి తగ్గింది. అదే విధంగా, ఉత్తరాఖండ్‌లో, BJP బలం 56 నుండి 47కి పడిపోయింది. దీంతో ఎన్డీయేత‌ర పార్టీల మ‌ద్ధ‌తు అవ‌స‌రం అయింది. భారతదేశంలో, ప్రెసిడెంట్‌ని ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు ఇద్దరితో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా పరోక్షంగా ఎన్నుకుంటారు. ఎన్నికల్లో ఎంపీ ఓటు విలువ 708 కాగా, ఎమ్మెల్యే ఓటు విలువ రాష్ట్ర జనాభా, రాష్ట్ర అసెంబ్లీ ఎమ్మెల్యేల సంఖ్య రెండింటిపై ఆధారపడి ఉంటుంది. యూపీ ఎమ్మెల్యేల ఓటు విలువ దేశంలోనే అత్యధికంగా ఉండటంతో రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ బలం పడిపోవడంతో బీజేపీ ఇత‌రుల‌పై ఆధార‌ప‌డాల్సి వ‌చ్చింది.

ప్రస్తుత భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24, 2022తో ముగియనుంది. రాష్ట్రపతి ఎన్నిక త్వరలో జరగనుంది. ఏది ఏమైనప్పటికీ, ఎన్నికల మెజారిటీ మార్కును చేరుకోవడానికి ఇతర రాజకీయ పార్టీల సహాయం అవసరం కాబట్టి, బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)కి ఈ ఎన్నికలు స‌వాలే. ఐదు రాష్ట్రాలలో నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రెండింటిలోనూ బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య తగ్గినందున రాష్ట్రపతి ఎన్నికలలో గెలవడానికి అవసరమైన ఓట్ల సంఖ్య NDAకి తక్కువగా ఉంది. దీంతో ద‌క్షిణ‌, ఉత్త‌ర‌భార‌త దేశం ఈక్వేష‌న్ తీసుకుని అభ్య‌ర్థిని ఎంపిక చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. జూన్ మొద‌టి వారంలో రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిని ఎంపిక చేసే అవ‌కాశం ఉంద‌ని బీజేపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆ ఎంపిక ఎలా ఉంటుందో చూద్దాం!