Prashant Kishor: బీజేపీతో ఇమడలేకే నితీశ్ బయటికొచ్చాడు : పీకే

జేడీయూ మాజీ నేత, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.గత ఐదు ఏళ్లలో ఎన్నడూ బీజేపీతో నితీశ్ కుమార్ ఇమడలేక పోయారని పేర్కొన్నారు.

  • Written By:
  • Publish Date - August 10, 2022 / 06:30 PM IST

జేడీయూ మాజీ నేత, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.గత ఐదు ఏళ్లలో ఎన్నడూ బీజేపీతో నితీశ్ కుమార్ ఇమడలేక పోయారని పేర్కొన్నారు. రాజకీయ, పరిపాలనా అంచనాలు నెరవేరనందునే నితీశ్ ఈ నిర్ణయాన్ని తీసుకొని ఉండొచ్చని చెప్పారు. కొత్త ప్రభుత్వంలో యువనేత తేజస్వి యాదవ్ ప్రధాన పాత్ర పోషిస్తారని తాను అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు.ఈ క్రమంలో నితీష్‌ కుమార్‌ జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ చేస్తున్నారా? అన్న ప్రశ్నకు పీకే బదులిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సీఎం నితీష్‌కు అలాంటి ఆశ లేదని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. బీహార్‌ రాజకీయాల్లోనే కీలకంగా ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. 2017 ఎన్నికలకు ముందు నితీష్ వేరు.. ఇప్పటి నితీష్ వేరు అని తెలిపారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయనను భావించట్లేదని స్పష్టం చేశారు. కాగా, బీహార్‌లో బీజేపీతో తెగదెంపులు చేసుకుని జేడీయూ చీఫ్‌ నితీష్‌ కుమార్‌.. కాంగ్రెస్‌, ఆర్జేడీతో పొత్తుపెట్టుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం బీహార్‌ సీఎంగా ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

గట్టిగా నిలబడతారు..

బీహార్ గత 10 సంవత్సరాలుగా రాజకీయ అస్థిరతకు కేంద్రంగా ఉందని, ఈ అస్థిరత మధ్య ముఖ్యమంత్రిగా కొనసాగిన నితీష్ కుమార్ పరిస్థితికి ప్రధాన కారకుడని అన్నారు. కొత్త పరిణామాలు కూడా అదే దిశలో ఉన్నాయని, బీహారీగా నితీష్ కుమార్ ఇప్పుడు నిర్మించుకున్న కూటమిపై గట్టిగా నిలబడతారని మాత్రమే తాను ఆశించగలనని ప్రశాంత్ కిషోర్ అన్నారు.