Site icon HashtagU Telugu

Bihar Assembly: బల పరీక్ష నెగ్గిన నితీష్ సర్కార్…బీజేపీపై ఫైర్

Bihar Cm Nitesh

Bihar Cm Nitesh

జేడీయూ నేత నితీశ్ కుమార్ నేతృత్వంలో కొత్త‌గా ఏర్ప‌డిన మ‌హా కూట‌మి ప్ర‌భుత్వం బిహార్ అసెంబ్లీలో జ‌రిగిన బ‌ల‌పరీక్ష‌లో విజ‌యం సాధించింది. బీజేపీతో తెగ‌తెంపులు చేసుకుని, ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాల‌తో క‌లిసి మ‌హా కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసిన జేడీయూ నేత నితీశ్ కుమార్ సునాయాసంగా మెజారిటీ నిరూపించుకున్నారు. బ‌ల ప‌రీక్ష‌కు ముందు స్పీక‌ర్ ప‌ద‌వికి బీజేపీ స‌భ్యుడు విజ‌య్ కుమార్ సిన్హా రాజీనామా చేశారు. అధికార ప‌క్ష స‌భ్యులు ఆయ‌న‌పై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌డంతో స్పీక‌ర్ ప‌ద‌వికి విజ‌య్ కుమార్ సిన్హా రాజీనామా చేశారు. దాంతో తాత్కాలిక స్పీక‌ర్ గా మ‌హేశ్వ‌ర్ హ‌జారీ వ్య‌వ‌హ‌రించారు. బల పరీక్షలో నితీష్‌ సారథ్యంలోని మహాఘట్ బంధన్ సర్కార్‌కు 160 ఓట్లు వచ్చాయి. కాగా ఓటింగ్‌కు ముందే అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేశారు. విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సందర్భంగా అసెంబ్లీలో సీఎం నితీష్‌ మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీలో మంచి వాళ్లకు చోటు లేదని వ్యాఖ్యానించారు.

2015లో బీజేపీని తానే గెలిపించానని, 2024లో బీజేపీకి తానేంటో నిరూపిస్తానని చాలెంజ్‌ చేశారు. వాజ్‌పేయి, అద్వానీలే తన మాట వినేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు బీజేపీలో లేవన్నారు. 2017లో తేజస్వీ యాదవ్‌పై విమర్శలు చేశారని, ఇప్పటి వరకు ఎందుకు నిరూపించలేదని ప్రశ్నించారు. అటు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కూడా బీజేపీపై విమర్శలు గుప్పించారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం, డబ్బు ఆశ చూపి వారిని కొనుగోలు చేయడం బీజేపీ ఫార్ములా అని డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ ధ్వజమెత్తారు. ఆర్జేడీ-జేడీయూ కొత్త భాగస్వామ్యం చారిత్రాత్మకమని అన్నారు. తమ భాగస్వామ్యం సుదీర్ఘ కాలం నిలవనుందని, దీనిని ఎవరూ పడగొట్టలేరని ధీమా వ్యక్తం చేశారు. కాగా గత కొంతకాలంగా బీజేపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌ ఈ నెల ప్రారంభంలో ఎన్డీయే కూటమికి గుడ్ బై చెప్పి..మ‌హా కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు.