JDU – NDA : బీజేపీకి షాక్.. అగ్నివీర్ స్కీం, యూసీసీపై సమీక్షించాల్సిందేనన్న జేడీయూ

త్వరలో కేంద్రంలో ఏర్పడనున్న ఎన్డీయే కూటమి సంకీర్ణ ప్రభుత్వంలో చక్రం తిప్పేందుకు నితీశ్ కుమార్ రాజకీయ పార్టీ జేడీయూ రెడీ అయింది.

  • Written By:
  • Publish Date - June 6, 2024 / 03:01 PM IST

JDU – NDA : త్వరలో కేంద్రంలో ఏర్పడనున్న ఎన్డీయే కూటమి సంకీర్ణ ప్రభుత్వంలో చక్రం తిప్పేందుకు నితీశ్ కుమార్ రాజకీయ పార్టీ జేడీయూ రెడీ అయింది. ఇప్పటికే నాలుగైదు కీలక కేంద్ర మంత్రి పదవులను జేడీయూ కోరుతోంది. రైల్వే శాఖ, రోడ్డు రవాణా శాఖ, వ్యవసాయ శాఖ, రూరల్ డెవలప్మెంట్ శాఖలను తమకు ఇవ్వాలని నితీశ్ కుమార్ పార్టీ డిమాండ్ చేస్తోంది. తాజాగా ఇంకొన్ని అంశాలను ఆ పార్టీ తెరపైకి తెచ్చింది. బీజేపీ(JDU – NDA) ఎదుట మరిన్ని డిమాండ్లను  జేడీయూ ఉంచింది. ఆ వివరాలను చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join

ప్రజల డిమాండ్లు పరిగణనలోకి తీసుకోవాలి

సైనిక నియామ‌కాల కోసం మోడీ స‌ర్కార్ తీసుకొచ్చిన అగ్నివీర్ స్కీంపై జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్నివీర్ స్కీమ్‌పై దేశంలోని ఓట‌ర్లు అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ని ఆయన తెలిపారు. ‘‘అగ్నివీర్ స్కీంకు సంబంధించి ప్ర‌జ‌లు చేస్తున్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. వాటిపై కొత్త ప్రభుత్వం చర్చించి మార్పులు చేసేందుకు సిద్ధం కావాలి. మా పార్టీ కోరుకునేది అదే’’ అని కేసీ త్యాగి చెప్పారు. అగ్నివీర్ స్కీంలోని లోటుపాట్ల‌ను పూడ్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందన్నారు. ఇక ఉమ్మ‌డి పౌర‌స్మృతి(యూసీసీ)పైనా  కేసీ త్యాగి స్పందించారు. గతంలో జేడీయూ పార్టీ అధ్య‌క్షుడి హోదాలో లా క‌మిష‌న్ చీఫ్‌కు బిహార్ సీఎం నితీష్ కుమార్ లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. జేడీయూ పార్టీ యూసీసీకి వ్య‌తిరేకం కాద‌ని.. అయితే యూసీసీ వల్ల ప్ర‌భావిత‌మయ్యే అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో చ‌ర్చించి ఓ పరిష్కారం అన్వేషించాల‌ని తాము కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

Also Read : Govt Dating App : గవర్నమెంట్ డేటింగ్ యాప్.. యువతకు లక్కీ ఛాన్స్

ఈసారి కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు జేడీయూ మద్దతు కీలకం కానుంది. ఈ తరుణంలో అగ్నివీర్ పథకంలో మార్పులు కోరుతున్న జేడీయూ ప్రతిపాదనలకు బీజేపీ అంగీకరించే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అంగీకరించకుంటే.. నితీశ్ కుమార్ ఎలా స్పందిస్తారు ? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? అనేవి పెద్ద ప్రశ్నలుగా మారుతాయి. గతంలో బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ 272 లోక్‌సభ సీట్లు ఉండేవి. దీంతో అప్పట్లో ఈవిధమైన పరిస్థితి బీజేపీకి ఎదురుకాలేదు. ఈసారి మాత్రం బీజేపీకి 240 లోక్‌సభ సీట్లే వచ్చాయి. దీంతో ఎన్డీయే కూటమిలోని మిత్రపక్షాల మనోభావాలను, డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాల్సిన స్థితి ఏర్పడింది. మిత్రపక్షాల సూచనలను బీజేపీ ఎలా పరిగణనలోకి తీసుకుంటుంది ? ఎలా స్పందిస్తుంది ? అనే దానిపైనే ఈసారి ఎన్డీయే సర్కారు భవితవ్యం ఆధారపడి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.