Nitish Special Status: నితీష్ ”స్పెషల్” ప్రామిస్

ప్రధాని అభ్యర్థిత్వం రేసులో లేనంటూనే.. భారీ హామీలు ఇచ్చేస్తున్నారు బిహార్ సీఎం నితీశ్‌ కుమార్‌.

  • Written By:
  • Publish Date - September 15, 2022 / 09:24 PM IST

ప్రధాని అభ్యర్థిత్వం రేసులో లేనంటూనే.. భారీ హామీలు ఇచ్చేస్తున్నారు బిహార్ సీఎం నితీశ్‌ కుమార్‌. తాయిలాలు గుప్పిస్తున్నారు. విపక్ష కూటమి కేంద్రంలో అధికారం చేపడితే.. బిహార్‌కే కాదు.. వెనుకబడిన రాష్ట్రాలన్నింటికీ స్పెషల్ స్టేటస్ అంటూ నితీశ్‌ బిగ్ ప్రామిస్ చేశారు. బిహార్​ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నీతీశ్​ కుమార్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో ప్రతిపక్ష పార్టీల కూటమి అధికారంలోకి వస్తే.. వెనకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ప్రకటించారు.

ప్రత్యేక హోదా ముగిసిన కథ అని కేంద్రం చెబుతున్నప్పటికీ, ఈ ప్రకటనతో మరోసారి హోదా చర్చకు నితీష్‌కుమార్‌ తెరతీశారు . గత నెలలో నీతీశ్‌ కుమార్‌ BJPతో పొత్తు తెంచుకుని.. ఆర్జేడీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా నీతీశ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే తనకు అలాంటి ఆలోచన లేదని ఆయన ఇప్పటికే చెప్పిన నితీష్కుమార్‌ రాజధాని ఢిల్లీలో పర్యటించారు. కాంగ్రెస్‌ సహా పలు ప్రధాన పార్టీల పెద్దలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని 2007 నుంచి నీతీశ్ డిమాండ్‌ చేస్తూన్నారు. BJPతో పొత్తులో ఉన్నప్పుటికీ ఈ డిమాండ్‌ను వీడలేదు. అయితే ఆశించిన ఫలితం రాబట్టడంలో నితీష్‌ విఫలమయ్యారు. సాధారణంగా ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాల్లోని పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం ప్రత్యేకహోదా ఇస్తుంది. అలాంటి సమయాల్లో కేంద్ర, రాష్ట్రాల నిధుల నిష్పత్తి 90:10గా ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేక హోదా అమలవుతోంది. ఈశాన్యభారతంలోని 8 రాష్ట్రాలు, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అమలవుతోంది.