Site icon HashtagU Telugu

Nitish Kumar : ఎనిమిదోసారి బీహార్ సీఎంగా నితీశ్‌

Nitish Kumar

Nitish Kumar

ఎన్డీయే కూట‌మికి ప్ర‌త్యేకించి మోడీ, అమిత్ షాకు జ‌ల‌క్ ఇస్తూ నితీశ్ కుమార్ తీసుకున్న నిర్ణ‌యం దేశ రాజ‌కీయాల‌ను మార్చేలా క‌నిపిస్తోంది. ఆయ‌న ఎన్డీయే కూటమి నుంచి తప్పుకోవడం ఇదేం తొలిసారి కాదు. బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా నరేంద్ర మోదీ నియమితులైన వెంట‌నే 2013లో నితీష్ బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ ఏడాది తొలిసారిగా బీజేపీతో పొత్తుకు గుడ్ బై చెప్పారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి 2015లో మహాకూటమిని క‌ట్టారు. కానీ, తేజస్వి యాదవ్‌తో విభేదాల కారణంగా 2017లో ఆ మహా కూటమి నుంచి వైదొలిగారు. ఆ వాతావరణంలో పని చేయడం కష్టంగా ఉందని మళ్లీ ఎన్డీయేలో చేరి సీఎం పీఠాన్ని ద‌క్కించుకున్నారు.

బీజేపీతో స‌ర్దుకుపోలేని ప‌రిస్థితుల్లో ఎన్డీయేకు మంగ‌ళ‌వారం మూడోసారి గుడ్ బై చెప్పారు. బీహార్ లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం అయింది. ఆ కూటమికి నాయ‌క‌త్వం వ‌హిస్తూ మ‌రోసారి సీఎంగా నితీశ్ ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. నూతన మంత్రి వర్గంలో బెర్త్‌లు ఇంకా ఖరారు కాలేదు. తేజస్వి యాదవ్‌కు డిప్యూటీ సీఎం పదవి లభిస్తుందని, స్పీకర్‌ను ఆయన పార్టీ ఆర్జేడీ నుంచి ఎంపిక చేస్తారన్న ప్రచారం ఉంది. అలాగే, తేజస్వి హోం శాఖను కూడా కోరుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ శాఖ నితీశ్ దగ్గర ఉంది. ఇక, మహా కూటమిలోని ఇతర భాగస్వాములైన వామపక్షాలు, కాంగ్రెస్‌లు కూడా కొత్త ప్రభుత్వంలో బెర్త్‌లు పొందే అవకాశం ఉంది.

బీహార్ లోని కొత్త కూట‌మికి 164 మంది ఎమ్మెల్యేల మ‌ద్ధ‌తు ఉంది. ఆ జాబితాను ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ కు నితీశ్ అంద‌చేశారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏడు పార్టీల మద్దతు ఇస్తున్నట్టు రాత‌పూర్వ‌కంగా తెలియ‌చేశారు. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే, బుధ‌వారం ఎనిమిదోసారి బీహార్ సీఎంగా నితీశ్ ప్ర‌మాణ‌స్వీకారం చేస్తారు. ఇంకో వైపు ఆయ‌న న‌మ్మ‌క ద్రోహాన్ని బీజేపీ ఎత్తిచూపుతోంది.

2020 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పోటీ చేసింది. జేడీయూ కంటే బీజేపీకి ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్న‌ప్ప‌టికీ ముందుగా అనుకున్న ప్ర‌కారం నితీష్‌ కుమార్‌ను కూటమి త‌ర‌పున అయ్యారు.ఇప్పుడు జరుగుతున్నదంతా బీహార్ ప్రజలకు, బీజేపీకి ద్రోహం చేయడమే అవుతుంద‌ని బీజేపీ బీహార్ అధ్యక్షుడు సంజయ్జైశ్వాల్ అన్నారు. నితీశ్ కుమార్ రాజకీయాలు పూర్తిగా సీఎం కుర్చీ కోసమే అని బీజేపీ ఆర్‌కె సింగ్ విమర్శించారు. మరోవైపు జేడీయూతో జట్టు కట్టబోతున్న ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మంగళవారం బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పంజాబ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూటమి భాగస్వాములను బీజేపీ పార్టీ నాశనం చేసిందని గుర్తు చేస్తున్నారు.