Site icon HashtagU Telugu

Nitish Kumar Resigns as Bihar CM : సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా

Nitish Kumar Resigns As Bih

Nitish Kumar Resigns As Bih

బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ (Nitish Kumar ) రాజీనామా చేశారు. కొద్దీ సేపటి క్రితం (ఆదివారం ) గవర్నర్ కార్యాలయంకు వెళ్లిన ఆయన.. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు పత్రాన్ని గవర్నర్ కు అంజేసి ఆర్జేడీ, జేడీయూ మహాకూటమి ప్రభుత్వంను రద్దు చేయాలని కోరారు. నితీశ్‌ రాజీనామాకు గవర్నర్‌ అర్లేకర్‌ ఆమోదం తెలిపారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించారు. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్‌కుమార్‌ బీజేపీతో కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే పార్టీ నేతలతో సమావేశమయ్యారు నితీశ్.

“మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతునిస్తాం” అని ఎమ్మెల్యేలు భరోసా ఇవ్వడం వల్ల వెంటనే ఆయన రాజీనామా చేశారు. అటు బీజేపీతో మంతనాలు పూర్తయ్యాయి. మరికాసేపట్లోనే బీజేపీతో చేతులు కలిపి NDAలో చేరనున్నారు. ఆ తరవాత 9వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు నితీశ్. సాయంత్రం నాలుగు గంటలకు ఆయన సీఎం పదవిని చేపట్టనున్నట్టు సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

గత 20 ఏళ్లలో ఇప్పటికే 8 సార్లు బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నితీశ్ కుమార్. దేశ రాజకీయాల్లో ఇదో రికార్డు. 2022లో NDAతో తెగదెంపులు చేసుకున్న నితీష్…ఆ తర్వాత కాంగ్రెస్, RJD మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా 8వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. వాస్తవానికి 2000 సంవత్సరంలోనే తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నితీశ్ కుమార్. కానీ ఆయన ప్రభుత్వం వారం రోజులు కూడా నిలబడలేదు. బలపరీక్షలో ఓడిపోవడం వల్ల ప్రభుత్వం కూలిపోయింది. ఫలితంగా మళ్లీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారు. అప్పటి అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేశారు. ఆ తరవాత ఐదేళ్లకు అంటే 2005లో జేడీయూ, బీజేపీ పొత్తు పెట్టుకోడం వల్ల మెజార్టీ సీట్లు సాధించారు. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పుడే ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు తీసుకున్నారు నితీశ్. ఈ సారి ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఆ తరవాత 2010లో జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించి సీఎం పదవిని చేపట్టారు. కాకపోతే 2014లో ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి దిగిపోయారు.

2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో JDU,RJD, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవి నితీశ్ కుమార్‌నే వరించింది. అయితే..ఈ మహాఘట్‌బంధన్‌లో కొన్ని విభేదాలు తలెత్తాయి. సైద్ధాంతికంగా ఒక పార్టీ మరో పార్టీతో విభేదించింది. ఫలితంగా…2017 జులైలో మహాఘట్‌బంధన్‌ నుంచి తప్పుకున్నారు. వెంటనే బీజేపీ మద్దతుతో మరోసారి అధికారంలోకి వచ్చారు. అప్పుడూ ఆయనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరవాత అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి 2022లో బీజేపీకి గుడ్‌బై చెప్పారు. NDA నుంచి బయటకు వచ్చేశారు. బీజేపీతో సరిపడడం లేదంటూ తేల్చి చెప్పారు. RJD,కాంగ్రెస్‌ మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 8వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ఆ కూటమికీ గుడ్‌బై చెప్పేసారు. ఈరోజు సాయంత్రం 9 వ సారి సీఎం గా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

Read Also : Rajahmundry YCP MP Candidate : రాజమండ్రి వైసీపీ MP అభ్యర్థిగా సుమన్..?