Nitin Gadkari: అమెరికాతో సమానంగా భారత్​లో రోడ్లు..!

  • Written By:
  • Publish Date - March 23, 2022 / 01:12 PM IST

భారత్‌లో జాతీయ రహదారులను మరింత విస్తృతంగా నాణ్యతతో అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. తాజాగా మంగళవారం పార్ల‌మెండ్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో భాగంగా, లోక్‌సభలో మాట్లాడిన నితిన్ గ‌డ్క‌రీ, మ‌రో రెండేళ్ళ‌లో అంటే 2024 డిసెంబ‌ర్ నాటికి భారత్ రహదారులు, అమెరికా ప్రమాణాలకు సరితూగేలా మ‌రింత నాణ్యతతో నిర్మిస్తామని నితిన్ గడ్కరీ తెలిపారు.

దేశంలో రోడ్డు మౌళిక‌స‌దుపాయాలు పెర‌గ‌డం వ‌ల్ల, ఉద్యోగ అవ‌కాశాలు కూడా అధిక‌మ‌వుతాయ‌ని, ఈ క్ర‌మంలో టూరిజంతో పాటు వ్య‌వ‌సాయ రంగానికి కూడా ల‌బ్ధి చేకూరే అవ‌కాశం ఉంద‌ని గ‌డ్క‌రీ అన్నారు. ఇక దేశంలో లేహ్‌, ల‌డాఖ్‌, శ్రీన‌గ‌ర్‌లో రోడ్డు క‌నెక్టివిటీ కోసం కొత్త ప్రాజెక్టులు చేపట్టామని గ‌డ్క‌రీ తెలిపారు. అంతే కాకుండా శ్రీన‌గ‌ర్ నుంచి ముంబై మధ్య దాదాపు 20 గంట‌ల ప్ర‌యాణం జ‌రిగేలా రోడ్లు అభివృద్ది చేశామన్నారు.

ఇక దేశ రాజ‌ధాని ఢిల్లీ నుంచి జైపూర్‌, హ‌రిద్వార్‌, డెహ్రాడూన్‌ల‌కు రెండు గంట‌ల్లో చేరేలా క‌నెక్టివ్ ప్రాజెక్టులను త్వ‌ర‌లోనే పూర్తి చేస్తామ‌ని మంత్రి నితిన్ గ‌డ్క‌రీ తెలిపారు. అలాగే ఢిల్లీ నుంచి అమృత్‌స‌ర్‌కు నాలుగు గంట‌లు, ఢిల్లీ నుంచి ముంబైకి ఆరు గంట‌ల్లో ప్ర‌యాణం పూర్తి అయ్యేలా రోడ్లు ఏర్పాటు చేస్తున్నామ‌ని గ‌డ్కరీ తెలిపారు. అలాగే చెన్నై నుంచి బెంగుళూరు మ‌ధ్య రెండు గంట‌ల్లో జ‌ర్నీ జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు గడ్కరీ వెల్ల‌డించారు.

భార‌త్‌లో ఎక్క‌డి నుండి అయినా నేరుగా మాన‌స స‌రోవ‌రం వెళ్లేందుకు రోడ్డు మార్గాన్ని డెవ‌ల‌ప్ చేస్తున్నామ‌ని, ఈ రోడ్డు మార్గం ప‌నులు మ‌రో ఏడాదిలో పూర్తి కానున్న‌ట్లు నితిన్ గ‌డ్కరీ తెలిపారు. దేశంలో ఎనిమిది మూలలనూ కలుపుతూ సాలె గూడు మాదిరిగా రోడ్లను భారీ ఎత్తున అభివృద్ధి చేస్తున్న‌ నితిన్ గడ్కరీని ఇకముందు స్పైడర్ మ్యాన్ అని పిలవాల్సి ఉంటుందని అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ తాపిర్ గావో ప్ర‌శంసించారు. గ‌డ్క‌రీకి ఏదైనా సాధ్య‌మే అని, ఈ క్ర‌మంలో దేశంలో ప్ర‌తి మూల‌లో విస్తృత రోడ్ల నెట్‌వ‌ర్క్‌ను వేస్తున్నార‌ని మంత్రి గ‌డ్కరీ పై ఎంపీ తాపిర్ ప్ర‌శంస‌లు కురిపించారు.