Kinnar Seer Vs Modi : ప్రధానమంత్రి నరేంద్రమోడీ లోక్‌సభ స్థానంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్కడి నుంచి ఓ సంచలన అభ్యర్థిత్వం తెరపైకి వచ్చింది. వారణాసి నుంచి నిర్మోహి అఖారాకు చెందిన 47 ఏళ్ల ట్రాన్స్‌జెండర్ మహామండలేశ్వర్ హేమాంగి సఖి అఖిల భారత హిందూ మహాసభ (ఏబీహెచ్‌ఎం) టికెట్‌పై పోటీ చేస్తారని రాజీవ్ దీక్షిత్ వెల్లడించారు. ట్రాన్స్‌జెండర్ల హక్కుల అంశంపైకి ప్రభుత్వం, రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షించడానికి ఈ ఎన్నికల్లో మహామండలేశ్వర్ హేమాంగి సఖి పోటీ చేస్తున్నారని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘ప్రధానమంత్రి నరేంద్రమోడీ బేటీ బచావో, బేటీ పడావో ప్రచారాన్ని ప్రారంభించడం మంచి విషయమే. అయితే ఆయన హిజ్రాల గురించి అస్సలు ఆలోచించడం లేదు. మా హిజ్రాలలో ఎక్కువ మంది భిక్షాటన చేస్తుంటారు. మా సంక్షేమం గురించి ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండదా ?’’ అని హేమాంగి సఖి(Kinnar Seer Vs Modi) ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని తాను ఎన్నికల ప్రచారంలో ప్రజలకు తెలియజేస్తానని అంటున్నారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో హిజ్రాల కోసం కనీసం ఒక సీటు అయినా రిజర్వ్ చేయాలని హేమాంగి డిమాండ్ చేశారు. ‘‘నేను మోడీ జీని గౌరవిస్తాను. ఆయన చేసిన పనులను ఆరాధిస్తాను. కానీ నేను పోటీ చేయక తప్పదు. మా హిజ్రాల సమస్యలను అందరికీ చాటిచెప్పాల్సిన టైం ఇదే’’ అని హేమాంగి తేల్చి చెబుతున్నారు.
Also Read : Ugadi 2024 : ఈ సంవత్సరం ఏమేం జరుగుతాయో చెప్పేసిన ‘నవనాయక ఫలితాలు’
ఎవరీ హేమాంగి ?
- ట్రాన్స్‌జెండర్ మహామండలేశ్వర్ హేమాంగి సఖి గుజరాత్‌లోని బరోడాలో జన్మించారు. ముంబైలో పెరిగారు.
- శ్రీకృష్ణుడిపై భక్తితో హేమాంగి .. ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ నగరానికి చేరుకున్నారు.
- ఆమెకు తల్లిదండ్రులు ఉన్నారు. సోదరి వివాహం కూడా జరిగింది.
- శ్రీకృష్ణుడిపై భక్తితో ‘కథావాచక్’ గీతాలను ఆలపిస్తుంటారు. వీటిని ఆలపించిన ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌గా హేమాంగి రికార్డును సొంతం చేసుకున్నారు.
- ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా-2019 సందర్భంగా హేమాంగికి ఆచార్య మహామండలేశ్వర్‌గా పట్టాభిషేకం జరిగింది.
- 2019 ఫిబ్రవరి 4న అఖిల భారతీయ సాధు సమాజ్ ఆమెను భగవద్భూషణ్ మహామండలేశ్వర్ బిరుదుతో సత్కరించింది. ఆమెకు పశుపతి అఖారాకు చెందిన జగద్గురు పీఠాధీశ్వర్ గౌరీ శంకర్ మహారాజ్ పట్టాభిషేకం చేశారు.
- ఆమె మన దేశంలోనే మొదటి కిన్నర్ మహామండలేశ్వర్‌గా నిలిచారు.
- హేమాంగికి నిర్మోహి అఖాడాతో అనుబంధం ఉంది.