Site icon HashtagU Telugu

Budget 2025-2026: బడ్జెట్ కి సిద్ధం అవుతున్న నిర్మల సీతారామన్.. డిసెంబర్లో రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో భేటీ!

Budget 2025

Budget 2025

Budget 2025-2026: వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను సిద్ధం చేసేందుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా, ఆమె రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం డిసెంబర్ 21-22 తేదీల్లో రాజస్థాన్‌లో జరుగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు.

కేంద్ర బడ్జెట్ 2025-26కి సంబంధించి, రాష్ట్రాలు తమ సూచనలు తెలియజేసేందుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు, రెండు రోజుల పాటు ఆర్థిక మంత్రులతో భేటీ కానున్నారు. ఈ సమావేశం తర్వాత, జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కూడా జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఈసారి జరగబోయేది 55వ జీఎస్టీ మండలి సమావేశం.

ఇప్పటికే, జీవిత మరియు ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ రద్దు చేయాలని పెద్దఎత్తున డిమాండ్లు వేయబడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే ఈ విషయం మీద తుది నిర్ణయం తీసుకోవాలని అందరూ ఆశించారు. కానీ, ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత, కౌన్సిల్‌ మంత్రుల బృందానికి ఆ నిర్ణయాన్ని తీసుకునే బాధ్యత అప్పగించింది.

బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌధరి నేతృత్వంలో, జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందానికే జీవిత మరియు ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ రేట్లపై నిర్ణయం తీసుకునే బాధ్యత అప్పగించబడింది. ఈ బృందంలో కొన్ని కొత్త సభ్యులు కూడా చేరనున్నారని తెలిపారు. మంత్రుల బృందం, ప్రత్యేకంగా జీవిత మరియు ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ తగ్గించే అంశంపై ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.