Nipha virus in Kerala: దేశంలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. ముఖ్యంగా కేరళలో వైరస్ వ్యాప్తితో మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ వైరస్ తో 23ఏళ్ల వ్యక్తి గత సోమవారం మృతిచెందారు. దీంతో నిఫా వైరస్ వ్యాప్తిని నియంత్రణలోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలో మాస్కులను మళ్లీ తప్పనిసరి చేశారు. తర్వాత ఆదేశాలు వచ్చేంత వరకూ మాస్కుల నిబంధన కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
ఒకే చోట ఎక్కువ మంది గుమికూడవద్దు.. ఆదేశాలు..
పుణెలోని వైరాలజీకి నమూనాలు పంపగా నిఫా పాజిటివ్‌గా నిర్ధరణ అయిందని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి వెల్లడించారు. మృతుడితో సన్నిహితంగా మెలిగిన వారి ఆచూకీ తెలుసుకునేందుకు వైద్యారోగ్య, రెవెన్యూ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో నిఫా వైరస్ ప్రొటోకాల్ ప్రకారం కఠిన నిబంధనలను అధికారులు అమలు చేస్తున్నారు. తిరువలి పంచాయతీ పరిధిలోని నాలుగు వార్డుల్లో సినిమా థియేటర్లు, విద్యా సంస్థలను మూసివేయాల్సిందిగా ఆదేశించారు. ఒకే చోట ఎక్కువ మంది ప్రజలు గుమికూడవద్దని ఆదేశాలు జారీ చేశారు.
ఫ్రూట్ బ్యాట్స్‌లో సహజంగానే నిఫా వైరస్..
నిఫా వైరస్ జంతువుల నుంచి నేరుగా మనుషులకు సోకుతుందని తేలింది. దీన్ని జునోటిక్‌గా పేర్కొంటారు. తొలిసారి నిఫా వైరస్‌ను 1999లో గుర్తించారు. నిఫా ఆతిథ్య జీవుల జాబితాలో పందులు, ఫ్రూట్ బ్యాట్ అనే గబ్బిలాలు, కుక్కలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, గుర్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రూట్ బ్యాట్స్‌లో ఇవి సహజంగానే ఉంటాయి. వాటిపై ఎటువంటి ప్రభావం చూపించలేవు. ఈ గబ్బిలాలు పండ్లపై వాలితే వాటిని తీసుకోవడం ద్వారా వైరస్ మనుషులలోకి ప్రవేశిస్తుంది. రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా కూడా ఇతరులకు వైరస్ వ్యాపిస్తుంది.