Nipah virus : కేరళలో మరోసారి నిపా వైరస్ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలోని మలప్పురం, పాలక్కాడ్ జిల్లాల్లో ఇద్దరికి నిపా వైరస్ పాజిటివ్‌గా తేలడంతో, స్థానిక ఆరోగ్య యంత్రాంగం హైఅలర్ట్ ప్రకటించింది. కోజికోడ్ సహా మూడు జిల్లాల్లో నిపా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలను కఠినతరం చేయాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ సూచించింది.
ప్రాథమికంగా మలప్పురం, కోజికోడ్ మెడికల్ కాలేజీల్లో నిర్వహించిన పరీక్షల్లో నిపా వైరస్ నిర్ధారణ కాగా, తుది నిర్ధారణ కోసం నమూనాలను పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. అధికారిక ఫలితాలు రాకముందే, ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది.
ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపిన వివరాల ప్రకారం, నిపా వ్యాప్తిని నియంత్రించేందుకు జిల్లాలవారీగా 26 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. కాంటాక్ట్ ట్రేసింగ్, కంటైన్మెంట్ ప్రణాళిక, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు వేగంగా అమలు చేస్తున్నారు. పోలీసులు, వైద్య సిబ్బంది సమన్వయంతో పరిస్థితిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైతే కంటైన్మెంట్ జోన్లు ప్రకటించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
మలప్పురంలో ఈ ఏడాది మే నెలలోనే నిపా వైరస్ పాజిటివ్‌గా తేలిన 42 ఏళ్ల వ్యక్తి వరుసగా రెండు టెస్టుల్లో నెగెటివ్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చారు. నెల రోజుల వ్యవధిలో మళ్లీ నిపా కేసులు నమోదవుతుండడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.
HHVM : యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్