భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) ద్వారా పాక్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రాంతాల్లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్లు రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ (Rajnath Singh) లోక్‌సభలో ప్రకటించారు. మే 6, 7 తేదీలలో జరిగిన ఈ ఆపరేషన్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు, వారి ట్రైనర్లు, హ్యాండ్లర్లు మృతిచెందినట్లు వెల్లడించారు. ఈ ఉగ్రవాదులు లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి పాక్ మద్దతు ఉన్న సంస్థలకు చెందినవారని స్పష్టం చేశారు.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ చేపట్టబడిందని మంత్రి పేర్కొన్నారు. “ఈ దాడుల కోసం భారత సైన్యం పూర్తి స్థాయిలో ముందస్తు పరిశీలనలు జరిపింది. ఉగ్రవాదులపై గరిష్టంగా ప్రభావం చూపేలా ప్లాన్ చేసి, పౌరులపై ఎలాంటి హాని కలగకుండా చర్యలు తీసుకున్నారు” అని రాజనాథ్ సింగ్ వివరించారు.
Trump : డప్పుకొట్టుకోవడం ఆపని ట్రంప్.. మరో యుద్ధాన్ని ఆపేశానంటూ వ్యాఖ్యలు..
“ఆపరేషన్ సింధూర్ సైనిక చర్య మాత్రమే కాదు, అది భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై తీసుకున్న గట్టి ధోరణి యొక్క స్పష్టమైన ఉదాహరణ” అని పేర్కొన్నారు. ఈ చర్య భారత సార్వభౌమాధికారానికి, దేశపు ప్రజల భద్రతకు, మన సైనికుల కట్టుబాటుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని ఆయన అభిప్రాయపడ్డారు.
“మన సైనికులు దేశ రక్షణ కోసం ప్రాణత్యాగానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. పహల్గామ్ దాడి తర్వాత వారు తీసుకున్న నిర్ణయం అత్యంత సాహసోపేతం మరియు సూత్రబద్ధమైనది” అని మంత్రి కొనియాడారు. ప్రస్తుత మాన్సూన్ సెషన్‌లో ఈ ఆపరేషన్‌పై లోక్‌సభ చర్చకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఆందోళనల మధ్య సభ మూడుసార్లు వాయిదా పడిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
కొంతమంది ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలపై సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. “మన వాయుసేనకు చెందిన విమానాలు ఎన్ని పడిపోయాయో అని వారు అడుగుతున్నారు. కానీ ఇది జాతీయ భావోద్వేగాలకు సరిపడే ప్రశ్న కాదని నేను భావిస్తున్నాను” అని ఆయన వ్యాఖ్యానించారు. మన సైన్యం ఎంతమంది శత్రు విమానాలను కూల్చారో అడగడం గానీ, ఉగ్ర స్థావరాలపై మన దాడులు ఎంత సక్సెస్ అయ్యాయో చెప్పని అని ప్రశ్నిస్తే బాగుంటుంది. ” మనం ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామా? అంటే స్పష్టంగా అవును. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందా? సమాధానం అవును. ఉగ్రవాద నేతలు హతమయ్యారా? అవును. మన జవాన్లకు ఎలాంటి హాని జరిగింది? అంటే లేదు. మన జవాన్లకు ఎలాంటి నష్టం కలగలేదు అని క్లారిటీ ఇచ్చారు.