UPI : డిజిటల్ చెల్లింపులలో కీలక పాత్ర పోషిస్తున్న యూపీఐ (యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) వ్యవస్థలో త్వరలో కొన్ని కీలక మార్పులు జరగనున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ మార్పుల ద్వారా యూపీఐ సేవల మీద ఉన్న ఒత్తిడిని తగ్గిస్తూ, వినియోగదారులకు స్థిరమైన, వేగవంతమైన సేవలు అందించడమే ఎన్‌పీసీఐ లక్ష్యం.
మార్పులు ఏమిటి?
ఇప్పటివరకు యూపీఐ యాప్‌ల ద్వారా ఎంతసార్లైనా బ్యాలెన్స్ చెక్ చేయడం, పేమెంట్ స్టేటస్ చూడడం సాధ్యపడింది. కానీ కొత్త నిబంధనల ప్రకారం, యూజర్లు రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ తనిఖీ చేయవచ్చు. అదేవిధంగా, ఒకే మొబైల్ నంబర్‌తో లింక్ అయిన బ్యాంకు ఖాతాల సంఖ్య ఆధారంగా, రోజుకు 25 సార్లకు మించి ఖాతాల వివరాలను పరిశీలించలేరు. ఈ పరిమితులు యూపీఐ యాప్‌లు ఉపయోగించే ప్రతివారికి వర్తిస్తాయి. ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వాడేవారు అందరూ ఈ మార్పుల పరిధిలోకి వస్తారు.
ఆటోపేమెంట్ లావాదేవీల్లో మార్పులు
ఆటోమేటిక్ పేమెంట్లకు సంబంధించి కూడా కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. సబ్‌స్క్రిప్షన్ ఫీజులు, యుటిలిటీ బిల్లులు, ఈఎంఐ చెల్లింపులు వంటి ఆటోపేమెంట్లు ఇకపై రద్దీ లేని సమయాల్లోనే జరగాలి. అంటే, ఈ రిక్వెస్టులు అధిక ట్రాఫిక్ సమయంలో కాకుండా, యూపీఐ నెట్‌వర్క్ మీద ఒత్తిడి తక్కువగా ఉన్న సమయంలోనే షెడ్యూల్ చేయాలి. ఇది యూజర్ నుంచి ప్రారంభమయ్యే పేమెంట్లకు వర్తించదు. కేవలం సేవా ప్రదాతల నుండి వచ్చే ఆటో రిక్వెస్ట్‌లకే ఈ నిబంధనలు వర్తిస్తాయి.
మార్పుల వెనుక ఉన్న కారణం
ప్రస్తుతం నెలకు సుమారు రూ.1800 కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అలాంటి భారీ ట్రాన్సాక్షన్ వాల్యూమ్ మధ్యలో ఏమైనా అంతరాయం ఏర్పడితే, దాని ప్రభావం లక్షలాది వినియోగదారులపై పడుతుంది. 2025 ఏప్రిల్, మే నెలల్లో ఇప్పటికే యూపీఐ సేవలు అనేకసార్లు పనిచేయకపోవడం గమనించబడింది. దీని వెనుక ముఖ్యమైన కారణంగా అనవసరమైన ఏపీఐ కాల్స్ (API Calls) ఉండడం అని ఎన్‌పీసీఐ గుర్తించింది.
వినియోగదారులు పదే పదే బ్యాలెన్స్ చెక్ చేయడం, ట్రాన్సాక్షన్ స్టేటస్‌ను తిరిగి తిరిగి చూడటం వంటివే ఈ API కాల్స్‌ను పెంచుతున్నాయి. ఈనేపథ్యంలో, నెట్‌వర్క్‌పై భారం తగ్గించేందుకు తాజా మార్పులు అవసరమయ్యాయి.
వినియోగదారులపై ప్రభావం ఎంత?
నిజానికి ఈ మార్పులు సాధారణ వినియోగదారులపై పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు. ఎందుకంటే ఒక యూజర్ సాధారణంగా రోజుకు రెండు లేదా మూడు సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేస్తారు. ఒకవేళ ఏ వ్యక్తి 50 సార్లకు మించి చెక్ చేస్తే తప్ప ఈ పరిమితి సమస్యగా మారదు. అలాగే, ఆటోపేమెంట్లు చేసే యాప్‌లు – అంటే Netflix, Amazon Prime, లేదా ఇతర బిల్ చెల్లింపు యాప్స్ తమ రిక్వెస్ట్‌లను రద్దీ లేని సమయాల్లో పంపేలా షెడ్యూల్ చేస్తాయి. అందువల్ల వినియోగదారులు ఇబ్బందిపడే అవసరం లేదు. ఇక, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, వనరుల సమర్థ వినియోగం కోసం ఈ మార్పులు తప్పనిసరిగా మారాయి. ఎన్‌పీసీఐ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు, యూపీఐ సేవలను మరింత స్థిరంగా, నిరంతరంగా పనిచేయించే దిశగా ముందడుగు కావొచ్చు. వినియోగదారులు కూడా ఈ మార్పులను అర్థం చేసుకొని, అప్రమత్తంగా ఉండడం అవసరం.