Indian Railways : భారత రైల్వేలో ప్రయాణించే వారికి త్వరలో గణనీయమైన మార్పులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు ప్రయాణికుల లగేజీపై పెద్దగా ఆంక్షలు లేకుండా ఉన్న రైలు ప్రయాణ విధానంలో, రాబోయే రోజుల్లో విమానాశ్రయాల తరహాలో కఠిన నియమాలు అమలులోకి రానున్నాయి. ప్రయాణికుల నుంచి అదనపు బరువు ఉన్న లగేజీపై రుసుములు వసూలు చేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ఈ మార్పుల లక్ష్యం ప్రయాణ నైతికతను మెరుగుపరచడం, అలాగే ఆదాయాన్ని పెంచుకోవడమేనని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
ఎలక్ట్రానిక్ తూకపు యంత్రాలు.. తప్పనిసరి తనిఖీలు
ఈ కొత్త విధానం ప్రకారం, దేశవ్యాప్తంగా ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఎలక్ట్రానిక్ తూకపు యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులు తమ లగేజీని ప్లాట్‌ఫామ్‌లోకి ప్రవేశించే ముందు తూకం చేయించుకోవాలి. నిర్ణీత పరిమితికి మించి బరువు ఉంటే, అదనపు రుసుములు లేదా జరిమానాలు విధించబడతాయి. ఈ తనిఖీ పూర్తయ్యాకే ప్రయాణికులకు రైలు ఎక్కేందుకు అనుమతిని ఇస్తారు. కాగా, ప్రతి క్లాస్‌కు లగేజీ పరిమితి స్పష్టమైన మార్గదర్శకాలు. ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన మార్గదర్శకాల ప్రకారం, వివిధ తరగతుల ప్రయాణికులకు తగినంత లగేజీ పరిమితులు విధించబోతున్నారు.
ఏసీ ఫస్ట్ క్లాస్ – 70 కిలోల వరకూ ఉచితం
ఏసీ 2-టైర్ – 50 కిలోల వరకూ ఉచితం
ఏసీ 3-టైర్ మరియు స్లీపర్ క్లాస్ – 40 కిలోల వరకూ ఉచితం
జనరల్ క్లాస్ – 35 కిలోల వరకూ ఉచితం
ఈ పరిమితిని మించి లగేజీ తీసుకెళ్లే వారు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని మొదటిగా ఉత్తర మధ్య రైల్వే జోన్ పరిధిలో అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. విజయవంతమైతే, దేశవ్యాప్తంగా అన్ని జోన్‌లలో దీనిని విస్తరించే యోచన ఉంది. లగేజీ నియంత్రణలతో పాటు, ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించేందుకు రైల్వే శాఖ మరో కీలక అడుగు వేయనుంది. ఆధునీకరించిన రైల్వే స్టేషన్లలో ప్రముఖ బ్రాండ్ల దుకాణాలను ప్రారంభించాలన్న ప్రణాళికను రూపొందిస్తున్నారు. వీటిలో దుస్తులు, పాదరక్షలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్రయాణానికి అవసరమైన ఇతర సామాగ్రి అందుబాటులోకి రానుంది. దీని ద్వారా ప్రయాణికులకు ఒకరే చోటు వద్ద నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది. ఈ కొత్త విధానం ప్రయాణీకుల ప్రయాణ అనుభవాన్ని మెల్లిగా విమాన ప్రయాణానికి దగ్గర చేయబోతోంది. లగేజీ తనిఖీలు, పరిమితులు, షాపింగ్ సౌకర్యాలతో రైలు ప్రయాణం కూడా పద్ధతిగా, నియమాలతో కూడినదిగా మారబోతుంది. అయితే, ఇది ప్రయాణికులపై భారం కాకుండా, ప్రయోజనకరంగా మారాలంటే, సరైన అవగాహన, సులభతర విధానాలు అవసరం. రాబోయే రోజుల్లో ఈ నూతన మార్పులు ఎలా పనిచేస్తాయో చూడాల్సిందే.