దుబాయ్ ఎయర్ షోలో జరిగిన తేజస్ యుద్ధ విమాన ప్రమాదానికి సంబంధించిన కొత్త ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. అల మక్తూం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రేక్షకుల ముందే విమానం కిందకి దిగుతూ ఒక్కసారిగా మంటల్లో చిక్కుకోవడం చిత్రాల ద్వారా స్పష్టమైంది. భారీ నల్ల పొగ ఆకాశాన్ని కమ్మేసింది.
ఎయిర్ షోకు హాజరైన వారు ఒక్కసారిగా లేచి ప్రమాద దృశ్యాలను వారి మొబైల్‌ఫోన్లలో రికార్డు చేయడం కనిపించింది. దుబాయ్‌కు చెందిన రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అబూ బకర్ ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూశాడు. అతడు తీసిన వీడియోలో తేజస్ చివరి క్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఒకే సీటర్ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్ నెగటివ్ జీ టర్న్ చేస్తుండగా నియంత్రణ కోల్పోయింది. ఆ తర్వాత రోల్ మేనూవర్‌లోకి వెళ్తూ, అతి తక్కువ ఎత్తులో ఉండటం వల్ల విమానం స్థిర స్థితికి చేరుకోలేకపోయింది. రోల్ పూర్తయ్యే సరికి విమానం వేగంగా కిందికి దూసుకెళ్లి నేలపై బలంగా ఢీకొట్టింది.
“జెట్ క్రమంగా దిగుతూ వచ్చింది. పైలట్ మళ్లీ పైకి లాగుతాడనుకున్నాం కానీ ఒక్కసారిగా నేలపై పడిపోయింది” అని ఘటనను గుర్తుచేసుకున్నాడు అబూ బకర్
