New Labor Code: కేంద్ర ప్రభుత్వం కార్మిక సంస్కరణల దిశగా ఒక పెద్ద ముందడుగు వేస్తూ ఐదేళ్ల క్రితం పార్లమెంట్ ఆమోదించిన నాలుగు కొత్త శ్రమ సంహిత చట్టాలను (New Labor Code) ఇప్పుడు అమలు చేసింది. ఈ నాలుగు లేబర్ కోడ్‌లు- వేతనాల కోడ్ (Code on Wages), పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రతా కోడ్, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ అమలులోకి రావడంతో 29 పాత కార్మిక చట్టాలు రద్దయ్యాయి. ఈ సంస్కరణలు కార్మికులకు మరింత భద్రత, స్పష్టమైన నిబంధనలు, మెరుగైన సామాజిక భద్రతను అందించడానికి చారిత్రకపరంగా ముఖ్యమైనవని ప్రభుత్వం పేర్కొంది.
కొత్త లేబర్ కోడ్‌లో ముఖ్య అంశాలు ఏంటి?
కొత్త లేబర్ కోడ్ అతిపెద్ద ప్రభావం గ్రాట్యుటీ నిబంధనలపై పడింది.
గ్రాట్యుటీ నియమం: గతంలో ఒక ఉద్యోగి గ్రాట్యుటీ పొందడానికి ఐదేళ్ల నిరంతర సేవ తప్పనిసరి. కానీ ఇప్పుడు ఈ సమయాన్ని కేవలం ఒక సంవత్సరానికి తగ్గించారు. దీనివల్ల ఫిక్స్‌డ్-టర్మ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రత్యక్ష ప్రయోజనం లభిస్తుంది.
మహిళల భద్రత: మహిళలు తగిన భద్రతా ఏర్పాట్లతో నైట్ షిఫ్ట్‌లలో పనిచేయడానికి అనుమతి ఇవ్వబడింది. వారికి ఓవర్ టైం కోసం పురుషులతో సమానంగా రెట్టింపు చెల్లింపు లభిస్తుంది.
పని గంటలు: వారానికి 48 గంటలు పని సమయం నిర్ణయించబడింది. అయితే రోజుకు 8 నుండి 12 గంటల వరకు పని చేయవచ్చు.
ఓవర్ టైం వేతనం: ఓవర్ టైం విషయంలో కంపెనీలు రెట్టింపు జీతం ఇవ్వడం తప్పనిసరి.
Also Read: Meteorite: ప్రపంచంలోనే విచిత్రమైన సంఘటన.. శరీరంలోకి దూసుకొచ్చిన ఉల్కాపాతం!
కనీస వేతనం చట్టబద్ధమైన హక్కు
కొత్త కార్మిక చట్టాలు అమలులోకి రావడంతో అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనం చట్టబద్ధమైన హక్కుగా మారింది. ఇకపై ఏ రంగంలోని ఉద్యోగికి కూడా కనీస వేతనం కంటే తక్కువ చెల్లించడానికి వీలు లేదు. ప్రతి ఉద్యోగికి నియామకం సమయంలో అపాయింట్‌మెంట్ లెటర్ ఇవ్వడం కూడా తప్పనిసరి చేశారు. దీనివల్ల ఉద్యోగ నిబంధనలలో పారదర్శకత నిర్ధారించబడుతుంది. దేశవ్యాప్తంగా చిన్న, ప్రమాదకరమైన పని ప్రదేశాలతో సహా అన్ని చోట్ల ఈఎస్ఐసీ (ESIC) కవరేజ్‌ను తప్పనిసరి చేశారు. తద్వారా వైద్య- బీమా భద్రత పరిధి పెరుగుతుంది.
మీడియా, డబ్బింగ్ ఆర్టిస్టులకు రక్షణ
ముఖ్యంగా కొత్త లేబర్ కోడ్‌లలో మొట్టమొదటిసారిగా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, డిజిటల్, ఆడియో-విజువల్ మీడియా వర్కర్లు, తోటల కార్మికులు (ప్లాంటేషన్ వర్కర్లు), డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా అధికారిక కార్మిక రక్షణ పరిధిలోకి తీసుకురాబడ్డారు. దీనివల్ల ఈ రంగాలలో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగులకు సాధారణ ఉద్యోగ భద్రత, స్పష్టమైన కార్మిక హక్కులు లభిస్తాయి. కొత్త చట్టాల అమలుతో కార్మికులకు మరింత భద్రత లభిస్తుందని, ఉద్యోగంలో పారదర్శకత పెరుగుతుందని, పని పరిస్థితులు మెరుగుపడతాయని భావిస్తున్నారు.
