Joe Biden : 2024లో బైడెన్ కు బైబై చెబుతారట.. సర్వేలో సంచలన విషయాలు!!

రాజకీయాల్లో.. ప్రజా తీర్పులో.. ఎప్పటికీ మార్పులు జరుగుతుంటాయి. మారే పరిస్థితులు మనుషుల ఆలోచనలను కూడా మారుస్తాయి.

  • Written By:
  • Publish Date - July 26, 2022 / 04:00 PM IST

రాజకీయాల్లో.. ప్రజా తీర్పులో.. ఎప్పటికీ మార్పులు జరుగుతుంటాయి. మారే పరిస్థితులు మనుషుల ఆలోచనలను కూడా మారుస్తాయి. ఇప్పుడు అమెరికన్ల ఆలోచనలు కూడా మారుతున్నాయట. మొన్న బంపర్ మెజారిటీతో గెలిపించుకున్న అధ్యక్షుడు జో బైడెన్ పైనా అమెరికా యువత అసంతృప్తితో ఉన్నారని తాజా సర్వేల్లో వెల్లడైంది. అంతేకాదు సొంత పార్టీ డెమోక్రటిక్ వాళ్ళు కూడా బైడెన్ నాయకత్వం పట్ల వ్యతిరేకత చూపిస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఆయన నాయకత్వ దక్షతను అమెరికన్లు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఈనేపథ్యంలో మరోసారి అధ్యక్షుడిగా బైడెన్ పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది.

యువతకు ఎందుకింత వ్యతిరేకత ?

న్యూయార్క్ టైమ్స్ , సియానా కాలేజ్ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. 2024లో బైడెన్ అధ్యక్షుడిగా తమకు వద్దంటూ సుమారు 64 శాతం మంది సొంత పార్టీకి చెందిన కార్యకర్తలు వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు ఈ సర్వేలో తేలింది. ప్రత్యేకించి 30 ఏళ్లలోపు వయసు వారైతే సుమారు 94 శాతం మంది బైడెన్ అభ్యర్ధిత్వాన్ని ఏ మాత్రం అంగీకరించడం లేదని తేలింది.  బైడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత దేశ ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారిందనే అభిప్రాయానికి అమెరికా యువత వచ్చినట్లు సర్వేలో వెల్లడైంది. అధ్యక్షుడికి 79 ఏళ్లు ఉంటే తమలా ఎలా ఆలోచన చేస్తాడని అందుకే తాము కొత్త అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నామని యువతరం చెబుతున్నారు. ఉద్యోగాల కల్పన, ఆర్ధిక అభివృద్ధి విషయాల్లో బైడెన్ నిర్ణయాల పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వే నివేదిక పేర్కొంది. 75శాతం మంది ఓటర్లు తమకు దేశ ఎకనామీ చాలా ముఖ్యం అని చెప్పారట. బైడెన్ అసమర్థ నాయకత్వం వల్లే అమెరికాలో ఆర్ధిక ద్రవ్యోల్బణంవచ్చిందనే భావనలో యువత ఉన్నారని నివేదిక తెలిపింది. సర్వేలో సుమారు 96 శాతం మంది ఈ విషయాన్ని ధ్రువీకరించారట.