Site icon HashtagU Telugu

Modi On Nepotism : ఎంపీ కుటుంబాల‌కు మోడీ జ‌ల‌క్‌

Modi

Modi

కుటుంబ వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు బీజేపీలో అవ‌కాశం ఉండ‌ద‌ని ఆ పార్టీ ఎంపీల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సంకేతాలు ఇచ్చాడు. బంధుప్రీతి, వంశ రాజ‌కీయాల‌ను న‌డుపుతోన్న పార్టీల‌పై బీజేపీ పోరాడుతోంద‌న్న విష‌యాన్ని గుర్తు చేశాడు. ఎంపీల కుటుంబ స‌భ్యుల‌కు టిక్కెట్లు నిరాక‌రించే విధానాన్ని బీజేపీ తీసుకున్న విష‌యాన్ని మోడీ వెల్ల‌డించాడు. పార్టీలో ఆశ్రిత పక్షపాతాన్ని అనుమతించబోమ‌ని తేల్చి చెప్పాడు.నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన త‌రువాత బీజేపీ పార్లమెంటరీ పార్టీ తొలి సమావేశంలో ప్ర‌ధాని మోడీ పాల్గొన్నాడు. ఆ సంద‌ర్భంగా వార‌స‌త్వ రాజ‌కీయాల గురించి సీరియ‌స్ గా ప్ర‌స‌గించాడు. ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో ఎంపీల కుటుంబ సభ్యులకు టిక్కెట్లు నిరాకరించిన‌ విష‌యాన్ని ప్ర‌స్తావించాడు. కుటుంబ సభ్యులకు ఎవరైనా టిక్కెట్టు నిరాకరించిన త‌రువాత ఏవైనా ప‌రిణామాలు ఎదురైతే అందుకు బాధ్య‌త వ‌హిస్తాన‌ని మోడీ అన్నాడు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలను ప్రస్తావిస్తూ, కుల రాజకీయాలు అంతం అవుతున్నాయని ప్రధాని అభిప్రాయ‌ప‌డ్డాడు. ఉక్రెయిన్ లోని భారతీయ పౌరుల తరలింపును రాజకీయం చేస్తున్న బీజేపీయేత‌ర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను విమ‌ర్శించాడు. ఉక్రెయిన్ ప్రజలను ఓదార్చడానికి బదులుగా ఆయా ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర విద్యార్థులను తరలించాలని కేంద్రానికి లేఖలు రాస్తున్నారని అన్నాడు. ఒంటరిగా ఉన్న భారతీయ పౌరుల కుటుంబ సభ్యులను బిజెపి మాత్రమే చేరువ అయింద‌ని చెప్పాడు. ‘ఆపరేషన్ గంగా’ మరియు ఉక్రెయిన్ పరిస్థితి గురించి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ బిజెపి శాసనసభ్యులకు వివరించాడు. భారత పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియలో పాల్గొన్న వారందరి ప్రయత్నాలను ప్రధాన మంత్రి ప్రశంసించాడు. ఉక్రెయిన్లో మ‌ర‌ణించిన వాళ్ల‌కు బీజేపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో నివాళులు అర్పించారు.
ప్రధాని మోదీకి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు పూలమాలలు వేసి పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులందరూ స్వాగ‌తం పలికారు.