Myanmar Terrorists : అనుమానమే నిజమైంది. మయన్మార్ ఉగ్రవాదుల వల్లే మణిపూర్ లో హింసాకాండ జరిగిందని వెల్లడైంది. సాక్షాత్తూ మణిపూర్ ఎమ్మెల్యే మేనల్లుడు కూడా మయన్మార్ ఉగ్రవాద సంస్థ ‘కాంగ్లీ యావోల్ కనా లూప్’ (కేవైకేఎల్) కు సపోర్ట్ చేసిన వారి లిస్టులో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. రాజధాని ఇంఫాల్ లో ఆ ఉగ్ర సంస్థ తరఫున కార్యకలాపాలు చేయిస్తున్న 45 ఏళ్ల కరమ్ సత్రాజిత్ సింగ్ ను అరెస్టు చేశారు. అతడి నుంచి ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకున్నారు. మణిపూర్ లోని మైతై, కుకీ తెగల మధ్య గొడవలు పెట్టించడంలో ఇతర పాత్ర ఉందా ? అనే కోణంలో ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది.
We’re now on WhatsApp. Click to Join.
మయన్మార్ ఉగ్రవాద సంస్థ ‘కాంగ్లీ యావోల్ కనా లూప్’ (కేవైకేఎల్)లో క్రియాశీలక సభ్యుడిగా కరమ్ సత్రాజిత్ సింగ్ ఉండేవాడని పోలీసులు తెలిపారు. అతని నివాసంలో 9 ఎంఎం బెరెట్టా యూఎస్ కార్ప్ పిస్టల్, ఏడు రౌండ్ల మందుగుండు సామగ్రి, డబ్బు దొరికాయని వెల్లడించారు. ఇతడు మణిపూర్ ఎమ్మెల్యే మేనల్లుడు అని పోలీసులు ఇంకా వెల్లడించలేదు. కానీ విశ్వసనీయ సమాచారం అందిందంటూ దీనిపై జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. కరమ్ సత్రాజిత్ సింగ్ ను ఇంఫాల్‌లోని సింగ్‌జమీ సూపర్ మార్కెట్ ఏరియాలో ఇంఫాల్ వెస్ట్ కమాండో యూనిట్ అదుపులోకి తీసుకుంది. మయన్మార్‌లోని ఉగ్ర సంస్థల కోసం సూపర్ మార్కెట్ ఏరియాలోని వ్యాపార సంస్థల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు వెళ్లేందుకు అతడిని పట్టుకున్నారు. అతడిని విచారించగా.. తాను మయన్మార్‌లో నివసిస్తున్న రాబర్ట్ అనే వ్యక్తితో కలిసి ఉగ్ర కార్యకలాపాలు (Myanmar Terrorists) చేస్తున్నానని అంగీకరించాడు.