NEET 2022 Results : నీట్ 2022 ఫలితాలు విడుదల‌.. స‌త్తా చాటిన తెలుగు విద్యార్థులు

ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2022 ఫలితాలు బుధవారం రాత్రి విడుదలయ్యాయి.

  • Written By:
  • Publish Date - September 8, 2022 / 10:09 AM IST

ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2022 ఫలితాలు బుధవారం రాత్రి విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూలై 17న నీట్ UG పరీక్షలను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 17.64 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 9,93,069 మంది (56.27 శాతం) అర్హత సాధించారు. ఆంధ్రప్రదేశ్‌లో 61.77 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు.

రాజస్థాన్‌కు చెందిన విద్యార్థిని తనిష్క 715 మార్కులు సాధించి 99.99 పర్సంటైల్‌తో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఢిల్లీకి చెందిన వి.ఆశిష్‌బత్రా రెండో ర్యాంకు, కర్ణాటకకు చెందిన హృషికేష్ నాగభూషణ్ మూడో ర్యాంక్, రుచా పవాష్ నాలుగో ర్యాంక్ సాధించారు. తెలంగాణకు చెందిన ఇ.సిద్ధార్థరావు ఐదో ర్యాంకు సాధించాడు. ఏపీకి చెందిన ఎం.దుర్గా సాయి కీర్తి తేజ 12వ ర్యాంకు, ఎన్.వెంకటసాయి వైష్ణవి 15వ ర్యాంకు సాధించారు. జి. హర్షవర్ధన్ నాయుడు 25వ ర్యాంకు సాధించారు.

ఆంధ్రప్రదేశ్‌లో 11 ప్రభుత్వ, 15 ప్రైవేట్, 2 మైనారిటీ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో కన్వీనర్‌, ప్రొప్రైటర్‌, ఎన్‌ఆర్‌ఐ కోటాలతో కలిపి 5,060 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 సీట్లు (అదనపు EWS సీట్లతో సహా) ఉన్నాయి. ఆంధ్రా మెడికల్ కాలేజీ, గుంటూరు మెడికల్ కాలేజీ, కర్నూలు మెడికల్ కాలేజీ, రంగరాయ (కాకినాడ) కాలేజీల్లో 250 సీట్లు ఉన్నాయి. ఒంగోలు రిమ్స్‌లో అత్యల్పంగా 120 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఆల్ ఇండియా కోటా 325 సీట్లు, స్టేట్ కోటా 1,890 సీట్లు భర్తీ చేయబడతాయి. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో 175 సీట్లు ఉన్నాయి. కాగా 2 ప్రభుత్వ దంత వైద్య కళాశాలల్లో 140 సీట్లు, 14 ప్రైవేట్ డెంటల్ కాలేజీల్లో 1400కు పైగా బీడీఎస్ సీట్లు ఉన్నాయి.