NDA Vs PDA : ఇవాళే బెంగళూరులో 26 విపక్షాల భేటీ.. రేపు ఢిల్లీలో 30 “ఎన్డీఏ” పార్టీల సమావేశం

2024 లోక్ సభ ఎన్నికల కోసం అధికార, విపక్ష కూటముల ఏర్పాటు ప్రయత్నాలు స్పీడప్ అయ్యాయి. 

  • Written By:
  • Updated On - July 17, 2023 / 11:06 AM IST

NDA Vs PDA :  2024 లోక్ సభ ఎన్నికల కోసం అధికార, విపక్ష కూటముల ఏర్పాటు ప్రయత్నాలు స్పీడప్ అయ్యాయి.  ఈక్రమంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి బల ప్రదర్శనకు రెడీ అయ్యాయి. ప్రాంతీయ సమీకరణాలు, పరస్పర రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా తమకు మద్దతునిచ్చే పార్టీలతో ఆయా కూటములు ఏకకాలంలో భేటీ కాబోతున్నాయి. సోమ, మంగళవారాల్లో (నేడు, రేపు) బెంగళూరు వేదికగా 24 విపక్ష పార్టీలు సమావేశం కాబోతుండగా.. మంగళవారం (జులై 18న) ఢిల్లీ వేదికగా దాదాపు 30 పార్టీల మద్దతు కలిగిన ఎన్డీఏ కూటమి భేటీ జరగబోతోంది. ఈసారి జరగనున్న మీటింగ్ కు కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే సోనియా గాంధీ కూడా దీనికి హాజరవుతున్నారు. ఇక ఎన్డీఏ కూటమి భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. దీంతో ఈ మీటింగ్ లలో(NDA Vs PDA) ఏం జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. జులై 20 నుంచి మొదలుకానున్న పార్లమెంటు సమావేశాల్లో ఉమ్మడిగా అనుసరించాల్సిన వ్యూహాలు, యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)పై వైఖరి వంటి వాటిపైనా చర్చించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.

Also read : Hindu Temple Demolished: పాకిస్థాన్‌లో 150 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత.. కారణమిదే..?

విపక్ష కూటమి చైర్ పర్సన్ గా సోనియా గాంధీ ?

  • ప్రతిపక్ష పార్టీల రెండో సమావేశం సోమవారం బెంగళూరులో ప్రారంభం కానుంది.
  • రెండు రోజుల పాటు జరగనున్న ఈ మీటింగ్ లో 26 ప్రతిపక్ష పార్టీలు పాల్గొంటాయని అంటున్నారు. హాజరయ్యే పార్టీల సంఖ్య 24 అని తొలుత భావించినప్పటికీ.. ఈ లిస్టులో మరో రెండు పార్టీలు చేరాయి. కృష్ణ పటేల్ నేతృత్వంలోని అప్నా దళ్ (కె), తమిళనాడుకు చెందిన మనితానేయ మక్కల్ కచ్చి (ఎంఎంకె) కూడా హాజరవుతాయని తాజాగా వెల్లడైంది.
  • ఈసారి మీటింగ్ లో విపక్ష కూటమికి పేరును ప్రకటించడంతో పాటు దానికి కన్వీనర్ ను ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. కన్వీనర్ ఎంపిక తర్వాత కూటమి పక్షాల సమన్వయం, సీట్ల సర్దుబాట్లు, రాష్ట్రాల వారీగా వ్యూహ రచనపై కమిటీలను ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు.
  • విపక్ష కూటమి ఏర్పడిందనే సందేశాన్ని ప్రజల్లోకి పంపేందుకు ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తారనే కథనాలు వస్తున్నాయి.
  • విపక్ష కూటమి కన్వీనర్‌గా బీహార్ సీఎం నితీష్ కుమార్ లేదా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను ఎంపిక చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే మీటింగ్ లో సోనియాగాంధీ కూడా పాల్గొంటున్నందున ఆమెకు విపక్ష కూటమి చైర్‌ పర్సన్‌ పదవిని అప్పగించే ఛాన్స్ ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.
  • కూటమికి “పేట్రియాటిక్ డెమొక్రటిక్ అలయన్స్” (పీడీఏ)గా పేరు పెట్టే ఛాన్స్ ఉందని గతంలో సీపీఐ జాతీయ నేత రాజా వెల్లడించారు.
  • ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ  ప్రకటించిన నేపథ్యంలో ఈ మీటింగ్ కు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొననున్నారు. ఈ పరిణామం విపక్ష కూటమి బలాన్ని పెంచుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి.
  • కాగా, సోమవారం సాయంత్రం సోనియా గాంధీ ఇస్తున్న విందుకు కూడా విపక్ష నేతలు హాజరు కానున్నారు.

Also read : James Anderson: ఇంగ్లండ్ కు గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్టుకు జట్టులోకి జేమ్స్ ఆండర్సన్..!

ఎన్డీఏలోకి 6 కొత్త పార్టీలు ..

  • ఎన్డీఏ కూటమిలో ప్రస్తుతం 24 పార్టీలు ఉన్నాయి.
  • మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని అశోక్ హోటల్‌లో జరగనున్న ఎన్డీఏ మీటింగ్ వేదికగా మరో 6 పార్టీలు ఈ లిస్టులో చేరబోతున్నాయి.
  • అవేమిటంటే.. ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వర్గం), లోక్ జన్ శక్తి పార్టీ (రామ్ విలాస్), హిందూస్థానీ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఓం ప్రకాష్ రాజ్‌భర్). మీటింగ్ కు రావాల్సిందిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నుంచి వీరికి ఆహ్వానాలు అందాయి.
  • ఈ ఆరు పార్టీల చేరికతో ఎన్డీఏ కూటమిలోని మొత్తం పార్టీల సంఖ్య 30కి పెరగనుంది.

Also read : Carlos Alcaraz: వింబుల్డన్‌లో జకోవిచ్‌ కు షాక్ ఇచ్చిన కార్లోస్ అల్కరాజ్.. టైటిల్ గెలుచుకున్న అల్కరాజ్‍

ఏపీలో జనసేనతో పొత్తు..నితీష్ కు చెక్ పెట్టేందుకు రంగంలోకి నలుగురు  

విపక్ష కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న బీహార్ సీఎం నితీష్ కుమార్ కు చెక్ పెట్టడంతో పాటు అక్కడి 40 లోక్ సభ స్థానాలు లక్ష్యంగా బీహార్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ, హిందుస్తానీ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ సమతా, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీలను ఎన్డీఏలో చేర్చుకుంటున్నారని పరిశీలకులు అంటున్నారు. ఈ మీటింగ్ కు సడెన్ గా మాజీ ప్రధాని దేవెగౌడ పార్టీ జేడీ (ఎస్) తరఫున ఆయన కుమారుడు కుమారస్వామి హాజరైనా ఆశ్చర్యం లేదంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎన్డీఏ పాత మిత్రులు తెలుగుదేశం పార్టీ, శిరోమణి అకాలీదళ్‌ పార్టీలు కూడా మళ్ళీ అదే గూటికి చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ .. అది ఇక జరగకపోవచ్చంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ రెండు పార్టీలకు బీజేపీ చీఫ్ నడ్డా నుంచి ఇన్విటేషన్ అందకపోవడమే దానికి సంకేతమని చెబుతున్నాయి. పంజాబ్‌లో ఒంటరిగా పోటీ చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని పేర్కొన్నాయి.