Ajit Pawar: మహారాష్ట్ర దిగ్గజ నాయకుడు, నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత అజిత్ పవార్ అకాల మరణం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. ఒకవైపు ఎన్సీపీకి దిశానిర్దేశం చేసే నాయకుడు దూరమవ్వగా, మరోవైపు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. వీటన్నింటికీ మించి బారామతి ప్రజల అభిమాన ఎమ్మెల్యే ఇక లేరనే వార్త ఆ ప్రాంతాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది.
అజిత్ పవార్ మరణం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. అధికారం, పార్టీ సంస్థ, ఎమ్మెల్యేగా ఆయన వారసుడు ఎవరు కాబోతున్నారు? దీనిపై ప్రస్తుతం రాష్ట్రంలో జోరుగా చర్చ సాగుతోంది.
మహారాష్ట్ర తదుపరి డిప్యూటీ సీఎం ఎవరు?
అజిత్ పవార్ తర్వాత ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు ఎవరు చేపడతారనేది ఇప్పుడు మొదటి ప్రశ్న. ఈ రేసులో సునేత్రా పవార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అజిత్ పవార్ భార్య, రాజ్యసభ ఎంపీ అయిన సునేత్రా పవార్ ఈ బాధ్యతను చేపట్టాలని ఎన్సీపీ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. దీనితో పాటు మరికొన్ని పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.
ప్రఫుల్ పటేల్: ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు.
ఛగన్ భుజబల్: బలమైన ఓబీసీ నాయకుడు, సీనియర్ నేత.
సునీల్ తట్కరే: పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇతనికి కూడా గణనీయమైన మద్దతు ఉంది.
Also Read: iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది: సీఎం చంద్రబాబు
మహారాష్ట్ర బడ్జెట్‌ను ఎవరు ప్రవేశపెడతారు?
అజిత్ పవార్ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉండేవారు. 2026 బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన సమయం దగ్గర పడుతోంది. నిబంధనల ప్రకారం.. ఒక మంత్రి మరణించినా లేదా రాజీనామా చేసినా, ఆ శాఖలు తాత్కాలికంగా ముఖ్యమంత్రి పరిధిలోకి వస్తాయి. కొత్త నియామకం జరిగే వరకు ఆ బాధ్యతలు సీఎం దగ్గరే ఉంటాయి. కాబట్టి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
బారామతి తదుపరి ఎమ్మెల్యే ఎవరు?
దశాబ్దాలుగా బారామతి పవార్ కుటుంబానికి కంచుకోట. అజిత్ పవార్ వారసుడిగా ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో ఉన్న పేర్లు సునేత్రా పవార్ (భార్య), పార్థ్ పవార్ (పెద్ద కుమారుడు), జయ్ పవార్ (చిన్న కుమారుడు).
వీరితో పాటు అజిత్ పవార్ మేనల్లుడు రోహిత్ పవార్, గతంలో ఆయనపై పోటీ చేసిన యుగేంద్ర పవార్ పేర్లు కూడా చర్చకు వస్తున్నాయి. యుగేంద్ర పవార్‌ను శరద్ పవార్ వర్గం వారు ‘నవా దాదా’ (కొత్త దాదా) అని పిలుచుకుంటారు.
NCP తదుపరి జాతీయ అధ్యక్షుడు ఎవరు?
శరద్ పవార్ నుండి విడిపోయిన తర్వాత అజిత్ పవార్ తన స్వశక్తితో పార్టీని బలోపేతం చేశారు. ఇప్పుడు ఆయన లేని లోటును భర్తీ చేసే శక్తివంతమైన నాయకుడి కోసం పార్టీ వెతుకుతోంది. సునేత్రా లేదా పార్థ్ పవార్ పేర్లు వినిపిస్తున్నప్పటికీ ప్రఫుల్ పటేల్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న నేత. పటేల్ నాయకత్వంలోనే అజిత్ పవార్ కలలను సాకారం చేయాలని కార్యకర్తలు భావిస్తున్నారు.
బాధ్యతల విభజన
ఎన్సీపీ నాయకులు ఒక ప్రతిపాదనను ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. దాని ప్రకారం.. ప్రఫుల్ పటేల్ జాతీయ అధ్యక్షుడిగా, సునేత్రా పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతానికి రెండు ఎన్సీపీ వర్గాల విలీనం కంటే పార్టీలను విడిగా ఉంచడానికే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. అయితే విలీనంపై తుది నిర్ణయం శరద్ పవార్ చేతుల్లోనే ఉంటుంది.
