Nayab Singh Saini : హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం ఎంపికపై ఆ పార్టీ చర్చలు జరిపింది. దీంతో పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చిన నాయబ్ సింగ్ సైనీవైపే మొగ్గు చూపింది. సైనీని రెండోసారి సీఎంగా కొనసాగించడానికి అధిష్ఠానం సుముఖత వ్యక్తంచేసింది. బుధవారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష భేటీలో ఈమేరకు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, సీనియర్ నేత అనిల్ విజ్ ఆయన పేరును ప్రతిపాదించగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. హర్యానా ముఖ్యమంత్రిగా ఆయన గురువారం బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ కార్యక్రమానికి పార్టీ పరిశీలకులుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హాజరయ్యారు. కొత్త సీఎంగా ఎన్నికైన నాయబ్ సింగ్ సైనీకి వీరు శుభాకాంక్షలు చెప్పారు. రేపు జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
మనోహర్‌లాల్ ఖట్టర్ స్థానంలో హర్యానా ముఖ్యమంత్రిగా సైనీ ఈ ఏడాది మార్చిలో బాధ్యతలు స్వీకరించారు. పార్టీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ నెల 8న ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగా.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ కమలం పార్టీ మరోసారి ఘన విజయం సాధించింది. మొత్తం 90 స్థానాలున్న అసెంబ్లీలో ఆ పార్టీ 48 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ 37 సీట్లకే పరిమితమైంది.