PM-Kisan 18th Installment: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద 18వ విడతను విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi). మహారాష్ట్ర (Maharastra)లోని వాషిమ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతుల ఖాతాలో పీఎం 20 వేల కోట్లను పంపిణి చేశారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా 20,000 కోట్లను జమ చేశారు.
వెబ్‌కాస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా 732 కృషి విజ్ఞాన కేంద్రాలు (KVK ), 1 లక్షకు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మరియు 5 లక్షల కామన్ సర్వీస్ సెంటర్‌లతో సహా దాదాపు 2.5 కోట్ల మంది రైతులు ఈ కార్యక్రమంలో చేరారు. రైతులను ఆదుకోవడానికి మరియు ప్రత్యక్ష ఆర్థిక సహాయం ద్వారా వారి జీవనోపాధిని పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 24 ఫిబ్రవరి 2019న ప్రారంభించారు. భూమిని కలిగి ఉన్న రైతులకు మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ. 6,000 అందిస్తుంది. అందులో భాగంగానే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడత(PM-Kisan 18th Installment)ను అక్టోబర్ 5న ప్రధాన మంత్రి విడుదల చేశారు. 18వ విడత విడుదలతో ఈ పథకం కింద మొత్తం పంపిణీ రూ. 3.45 లక్షల కోట్లు దాటుతుంది. దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికి పైగా రైతులకు మద్దతునిస్తుంది. ఈ పథకం ద్వారా గ్రామీణాభివృద్ధి మరియు వ్యవసాయ శ్రేయస్సు కోసం ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. మహారాష్ట్రలో ఈ పథకం 17 విడతల్లో సుమారు 1.20 కోట్ల మంది రైతులకు సుమారు రూ. 32,000 కోట్లు బదిలీ చేయబడ్డాయి.
ఈ సందర్భంగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో సహా ప్రముఖులు పాల్గొన్నారు. వ్యవసాయ మంత్రి, భారత ప్రభుత్వం, శివరాజ్ సింగ్ చౌహాన్; కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, మరియు పాడి పరిశ్రమ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్; మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఏకనాథ్ షిండే; ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్ మరియు దేవేంద్ర ఫడ్నవిస్; మరియు మట్టి & నీటి సంరక్షణ మంత్రి, సంజయ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: NIA Raids : టెర్రర్ ఫండింగ్ కేసు.. ఐదు రాష్ట్రాల్లోని 22 చోట్ల ఎన్ఐఏ సోదాలు