Narendra Modi : ఇవాళ రాత్రి 7.15 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. దాదాపు 27 నుంచి 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసే ఛాన్స్ ఉంది. ఈనేపథ్యంలో ఇవాళ ఉదయం ప్రధాని మోడీ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి, సదైవ్ అటల్ వద్ద మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ యుద్ధ స్మారకం వద్దకు వెళ్లి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ప్రధాని మోడీ వెంట రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఇక మోడీ(Narendra Modi) ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం అందిందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఇండియా కూటమిలోని మిత్రపక్షాలను సంప్రదించిన తర్వాతే.. ఈ వేడుకల్లో పాల్గొనడంపై ఖర్గే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Also Read : Rain Forecast : నేడు, రేపు ఈ జిల్లాలకు వర్ష సూచన
మోడీ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు ఏడు దేశాలకు చెందిన ప్రభుత్వాధినేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. వారిలో చాలామంది శనివారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. ఆయా దేశాల అధినేతలు బస చేసిన హోటళ్ల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.ఇవాళ, రేపు రెండు రోజులు ఢిల్లీని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. ప్రమాణ స్వీకారోత్సవం కారణంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఢిల్లీలో గగనతలంపై ఆంక్షలు ఉంటాయి.ఈ కార్యక్రమానికి భద్రత కల్పించేందుకు డ్రోన్‌లు, స్నిపర్లు, పారామిలటరీ సిబ్బంది, ఎన్‌ఎస్‌జీ కమాండోలను మోహరించారు. ఇక మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి అతిథులు సాయంత్రం 5 గంటల నుంచి రావడం ప్రారంభిస్తారు. 7.15 గంటలకు ప్రమాణ స్వీకారం ప్రారంభమవుతుంది. ఢిల్లీ పోలీసులు ఇవాళ ఉదయం ఢిల్లీలోని వీవీఐపీ రూట్‌లో డమ్మీ కాన్వాయ్‌ను తీసుకెళ్లారు.