Manmohan Singh : ప్రధానమంత్రి నరేంద్రమోడీపై మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ విరుచుకుపడ్డారు. ‘‘ప్రధానమంత్రి లాంటి ఉన్నత పదవిలో ఉంటూ దేశంలోని ఓ నిర్దిష్ట వర్గంపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రధాని పదవి గౌరవాన్ని మోడీ తగ్గించారు’’ అని ఆయన విమర్శించారు. జూన్ 1న లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో మన్మోహన్ సింగ్ కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రధాని మోడీ విద్వేషపూరిత ప్రసంగాల ద్వారా దేశాన్ని రెండుగా విభజించే ప్రయత్నం చేశారని అభిప్రాయపడ్డారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘2022 నాటికి దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని మోడీ గతంలో హామీ ఇచ్చారు. అయితే గత 10 ఏళ్లలో ఇందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితులు అలుముకున్నాయి. రైతులకు వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది. ప్రస్తుతం రైతుల నెలవారీ ఆదాయపు జాతీయ సగటు విలువ రోజుకు రూ.27 కంటే తక్కువే ఉంది. ఒక్కో రైతుకు సగటున రూ. 27,000 అప్పు ఉంది. వ్యవసాయ ఎగుమతి, దిగుమతుల విషయంలో మోడీ సర్కారు విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంది. దీనివల్ల వ్యవసాయ కుటుంబాల పొదుపు మొత్తాలు చాలా తగ్గాయి. రైతులను పేదరికం ఆవరించింది’’ అని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ తన లేఖలో ప్రస్తావించారు.
Also Read :Hair In Stomach : ఆమె కడుపులో రెండున్నర కేజీల వెంట్రుకలు.. డాక్టర్లు షాక్!
‘‘పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలోని ప్రజల పాలిట పెను విపత్తుగా మారింది. లోపభూయిష్ట జీఎస్టీ విధానం ఎంతోమంది వ్యాపారులను దెబ్బతీసింది. కరోనా సంక్షోభ సమయంలో దేశ ప్రజల బాగు కోసం సరైన ప్రణాళికలను అనుసరించలేదు. దీనివల్లే దేశ ఆర్థిక పురోగతి నెమ్మదించింది’’ అని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘‘పంజాబ్‌కు చెందిన ఎంతోమంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతూ చనిపోయారు. వారితో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరిగ్గా లేదు. నిరంకుశ వైఖరితో మోడీ పాలన సాగిస్తుండటం ఆందోళనకరం. ఢిల్లీ శివార్లలో రైతుల నిరసనలను కట్టడి చేసేందుకు లాఠీలు, రబ్బరు బుల్లెట్‌లు సరిపోవన్నట్లుగా.. ప్రధాని మోడీ మాటలతోనూ అన్నదాతలపై దాడి చేశారు’’ అని మాజీ ప్రధాని వ్యాఖ్యానించారు. ‘‘తమను సంప్రదించకుండానే అమల్లోకి తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలనే ఏకైక డిమాండ్‌తో రైతులు నిర్వహించిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు. గత పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంజాబ్, పంజాబీలు, పంజాబియాత్‌లను దూషించేందుకు అందుబాటులో ఉన్న ఏ ఒక్క అంశాన్ని కూడా విడిచిపెట్టలేదు’’ అని మాజీ ప్రధాని(Manmohan Singh) తెలిపారు.