అమెరికా(America)లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) సరికొత్త రికార్డు నెలకొల్పనున్నారు. అక్కడి చట్టసభల్లో రెండోసారి ప్రసంగించనున్న భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. ఈనెలలోనే మోదీ అమెరికాలో పర్యటించాల్సి ఉంది. తమ దేశ పర్యటనకు వచ్చే మోదీకి అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్(Joe Biden) నుంచి అరుదైన ఆహ్వానం లభించింది. జూన్ 22వ తేదీన వైట్ హౌస్(White House)లో ఏర్పాటు చేసే విందుకు హాజరు కావాలంటూ జో బైడెన్, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ నుంచి మోదీకి ఆహ్వానం అందిన విషయం తెలిసిందే.
తాజాగా, అమెరికా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించాలంటూ మోదీకి వైట్ హౌస్ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ, సెనేట్ మెజారిటీ లీడర్ చక్ షూమర్, సెనేట్ రిపబ్లికన్ లీడర్ మిచ్ మెక్కానల్ తదితరులు ఆహ్వానించారు. ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా ఆ విషయాన్ని పంచుకున్నారు. అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు తాను ఉత్సకతతో ఉన్నానని, ఇది తనకు ఎంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామిక విలువల ఆధారంగా భారత్, అమెరికా బంధం ఏర్పడిందని, ప్రపంచ శాంతికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని అన్నారు.
యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగించడం ఇది రెండోసారి. జూన్ 2016లో అమెరికా పర్యటన సందర్భంగా ఆయన యూఎస్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నెల్సన్ మండేలాలకు రెండు సార్లు ఈ అరుదైన గౌరవం దక్కించింది. తాజాగా ప్రధాని మోదీకి ఈ అరుదైన గౌరవం దక్కనుంది. 2016లో అమెరికా చట్టసభల్లో మోదీ ప్రసంగించిన సమయంలో వాతావరణ మార్పుల నుంచి తీవ్రవాదం, రక్షణ, భద్రతా సహకారం, భారత్ – అమెరికాల మధ్య వాణిజ్యం, ఆర్థిక సంబంధాల వంటి అంశాలపై ప్రసంగించారు.
గతంలో అమెరికా చట్టసభల్లో ప్రసంగించిన భారత ప్రధానుల్లో నలుగురు ఉన్నారు. రాజీవ్ గాంధీ 1985లో, పీవి నరసింహారావు 1994లో, అటల్ బిహారీ వాజ్‌పేయి 2000 సంవత్సరంలో, మన్మోహన్ సింగ్ 2005 సంవత్సరంలో అమెరికా చట్టసభల్లో ప్రసంగించారు. 2016లో ప్రధాని మోదీ తొలిసారి అమెరికా చట్టసభలను ఉద్దేశించి ప్రసంగించగా.. మరోసారి ఈ నెల 22న అమెరికా చట్టసభలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
Also Reda : PM Modi: వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన పీఎం మోదీ