Nagpur Violence : సోమవారం రోజు (మార్చి 17) మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన అల్లర్ల మాస్టర్‌మైండ్ ఫహీం షమీమ్ ఖాన్ అని పోలీసులు వెల్లడించారు. అతడి ఫొటోను మీడియాకు విడుదల చేశారు. నాగ్‌పూర్‌లో జరిగిన అల్లర్లపై నగరంలోని గణేశ్ పేట్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో కీలక వివరాలు ఉన్నాయి. దాని ప్రకారం.. మైనారిటీ డెమొక్రటిక్ పార్టీ (ఎండీపీ) అధ్యక్షుడు ఫహీం షమీమ్ ఖాన్ సారథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద భారీగా జనం గుమిగూడారు. ఆ గుంపులోని పలువురి చేతుల్లో కత్తులు, రాళ్లు, కర్రలు, ప్రమాదకరమైన ఆయుధాలు ఉన్నాయి. ఈ వ్యక్తులు భయాన్ని సృష్టించి, మతపరమైన వైరాన్ని పెంచే ఉద్దేశంతో సామాజిక సామరస్యాన్ని దెబ్బతీయడానికి యత్నించారు. నాగ్‌పూర్ నగరంలోని భల్దార్‌పురా చౌక్ ప్రాంతంలో ఆ గుంపులోని కొంతమంది వ్యక్తులు పోలీసు బృందంపై మారణాయుధాలతో దాడి చేశారు. ఈ సమయంలో, ఒక దుండగుడు మహిళా కానిస్టేబుల్ యూనిఫామ్‌ను చింపి, ఆమె శరీరాన్ని తాకడానికి ప్రయత్నించాడు. అందుకే ఈ అల్లర్లకు మాస్టర్ మైండ్‌గా ఫహీం షమీమ్ ఖాన్‌ను పోలీసులు గుర్తించారు. ఫహీం షమీమ్ ఖాన్(Nagpur Violence) 2024 ఎన్నికల్లో నాగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశాడు. మైనారిటీస్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా అతడు అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేశాడు. నాగ్‌పూర్‌లో బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో గడ్కరీ చేతిలో ఫహీం షమీమ్ ఖాన్ 6.5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
Also Read :Kennedy Assassination: జాన్ ఎఫ్ కెనడీ హత్య.. సీక్రెట్ డాక్యుమెంట్లు విడుదల.. సంచలన వివరాలు
నాగ్‌పూర్ అల్లర్లపై ఎఫ్‌ఐఆర్‌లో..
- నాగ్‌పూర్‌లో జరిగిన అల్లర్లపై నగరంలోని గణేశ్ పేట్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పలు కీలక వివరాలను ప్రస్తావించారు.
- డ్యూటీలో ఉన్న ఒక మహిళా పోలీసు అధికారిపై కొందరు అల్లరి మూకలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఆమె యూనిఫామ్‌ను లాగి పట్టుకొని.. పలువురు అల్లరి మూకలు బెదిరించారని తెలిపారు.
- మహిళా పోలీసు సిబ్బందిని చూసి అల్లరి మూకలు అసభ్యకరమైన అభ్యంతరకర కామెంట్లు చేశారని ఆరోపించారు. మతపరమైన ఉద్రిక్తతలను పెంచేలా పలువురు అల్లరి మూకలు నినాదాలు చేశారని పేర్కొన్నారు.
- అల్లర్లలో పాల్గొన్న 51 మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లోని నిందితుల జాబితాలో చేర్చారు.
- నాగ్‌పూర్‌లోని వివిధ ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లలో దాదాపు 500 పాల్గొన్నట్లు పేర్కొన్నారు.
- మహారాష్ట్రలోని ఖుల్దాబాద్‌లో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలంటూ శంభాజీనగర్ జిల్లాలో వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఒక వర్గానికి చెందిన మత గ్రంథాన్ని తగలబెట్టారనే పుకారు వ్యాపించింది.
- ఈ పుకారు నిజమేనని భావించి సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో నాగ్‌పూర్‌లోని మహల్ ప్రాంతంలో అల్లర్లు మొదలయ్యాయి. ఈ అల్లర్లు క్రమంగా నగరంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి.
- పోలీసులు రంగంలోకి దిగి 144 సెక్షన్ విధించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.