Myanmar Militants : మయన్మార్ సైన్యం, తిరుగుబాటు దారుల మధ్య జరుగుతున్న ఘర్షణల ఎఫెక్టు పొరుగున ఉన్నమనదేశంపైనా పడింది. మయన్మార్ సరిహద్దు పక్కనే మణిపూర్ రాష్ట్రం ఉంటుంది. మణిపూర్‌లోని సరిహద్దు పట్టణం మోరెలోకి మయన్మార్ మిలిటెంట్లు చొరబడి ఉండొచ్చని ఆ రాష్ట్ర భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా బుధవారం రోజు మోరేలో పోలీసు కమాండోలు లక్ష్యంగా కాల్పులు జరిపిన కుకీ మిలిటెంట్లకు మయన్మార్ మిలిటెంట్ల నుంచి సహకారం అంది ఉండొచ్చన్నారు. మయన్మార్‌లో జుంటా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ (పీడీఎఫ్) తిరుగుబాటుదారులు మోరేలో స్థానిక పీడీఎఫ్ సభ్యులతో కలిసి మణిపూర్‌లోని భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉండొచ్చని అంటున్నారు. దీనిపై ఆధారాలు లేనప్పటికీ, ఇలా జరిగే అవకాశముందని కుల్దీప్ సింగ్ చెప్పారు. బుధవారం తెల్లవారుజామున మోరేలోని మూడు వేర్వేరు ప్రదేశాలలో కమాండో పోస్ట్‌లపై కుకీ మిలిటెంట్లు(Myanmar Militants) జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీస్ కమాండోలు అమరులయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
గతేడాది అక్టోబరులో పోలీసు అధికారి (ఎస్‌డీపీఓ) సీహెచ్ ఆనంద్ హత్య కేసులో మోరే పట్టణానికి చెందిన ఫిలిప్ ఖోంగ్‌సాయి, హేమోఖోలాల్ మేట్‌లను ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రత్యేక టీమ్ మోరే పట్టణానికి వచ్చి ఇద్దరు నిందితులను సోమవారం రోజు అరెస్టు చేసింది. వారిని వెంటనే కోర్టులో ప్రవేశపెట్టగా.. 9 రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశం జారీ చేసింది. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత (బుధవారం).. మోరే పట్టణంలోని ఏడో నంబర్ వార్డు వద్ద పోలీసుల వాహనాలపైకి సాయుధ తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఆర్‌పీజీ షెల్స్‌ను సంధించారు. దీంతో పోలీసులు వారిని వెంబడించి ప్రతికాల్పులు జరిపారు. కొన్ని గంటల పాటు ఈ కాల్పులు, ప్రతికాల్పులు కొనసాగాయి. ఈ ఘటనలోనే పోలీసు కమాండో వాంగ్‌ఖేమ్ సోమోర్జిత్ అమరులయ్యారు. మోరే పట్టణంలో కొందరు కుకీ మిలిటెంట్లు ఒక పోలీసు వాహనానికి ఎదురుగా నిలబడి.. తుపాకీతో బెదిరిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో మోరే పట్టణంలో జనవరి 16న ఉదయం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలవుతోంది. కాగా, 2023 మే 3న ప్రారంభమైన మణిపూర్ హింసలో 180 మందికిపైగా మరణించారు. వేలాది మంది భయంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు.