Modi: మా అమ్మ అసాధారణ మహిళ.. తల్లి హీరాబెన్ వందేళ్ల వసంతంలోకి అడుగిడిన సందర్భంగా మోడీ భావోద్వేగ ట్వీట్:

తన తల్లి హీరాబెన్ మోడీ వందేళ్ల వసంతంలోకి అడుగిడిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు.

  • Written By:
  • Updated On - June 18, 2022 / 11:36 AM IST

తన తల్లి హీరాబెన్ మోడీ వందేళ్ల వసంతంలోకి అడుగిడిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు. బాల్య జ్ఞాపకాలను, అమ్మతో పెనవేసుకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఓ భావోద్వేగ భరిత ట్వీట్ చేశారు. “అమ్మ.. అదొక సామాన్య పదం కాదు. ఎన్నో భావోద్వేగాలను మూటకట్టుకున్న అద్భుతం.

ఈరోజు (జూన్ 18) మా అమ్మ హీరాబా వందేళ్ళ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ శుభ వేళలో నేను నా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ , అమ్మకు ప్రణామాలు చేస్తూ మనసులోని భావాలకు అక్షర రూపం ఇచ్చాను” అని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు.

బ్లాగ్ పోస్ట్ లో…

ప్రధాని మోడీ తన బ్లాగ్ లోనూ అమ్మ గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చారు. ” మా అమ్మ అందరిలా సామాన్యమైనదే.. కానీ ఆమె ఒక అసాధారణ మహిళ అని గట్టిగా చెప్పగలను. మా అమ్మ చిన్న వయసులో ఉండగానే తల్లిని కోల్పోయింది. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదురీదింది. వాటిని ఎదుర్కొని ధైర్య శాలిగా నిలిచింది. జీవితంలో గెలిచింది. నా కోసం మా అమ్మ ఎన్నో త్యాగాలు చేసింది. మా అమ్మలోని గొప్ప సుగుణాలే నా మనసు, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసాలకు ఒక రూపం ఇచ్చాయి. గుజరాత్ లోని వడ్ నగర్ లో మేము నివసించిన పెంకుటిల్లును, దాని మట్టి గోడలను నేటికీ మర్చిపోలేదు. నా తోబుట్టువులతో కలిసి అక్కడే పెరిగి పెద్దయ్యాను.

ఇంటిని నడిపేందుకు మా అమ్మ చెమట చిందించిన క్షనాలు నాకు బాగా గుర్తున్నాయి. ఇరుగుపొరుగు ఇళ్లకు వెళ్లి మా అమ్మ గిన్నెలు కడిగే పని చేసేది. ఇంటి ఖర్చులు వెళ్లదీయడానికి చరఖా నడిపే పని కూడా అమ్మ చేసేది. వర్షాకాలంలో ఇల్లు కురుస్తుంటే.. ఆ నీరు ఇంట్లో పడకుండా మా అమ్మ బకెట్లు, పాత్రలు పెట్టేది. ఇటువంటి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకుండా అమ్మ మమ్మల్ని పెంచి పెద్ద చేసింది.పెద్దగా చదువుకోకున్నా.. పెద్దగా ఆలోచించవచ్చని మా అమ్మ నిరూపించింది. మా అమ్మ ఆలోచన విధానం, ముందుచూపు నాలో నిత్యం స్ఫూర్తి నింపేవి.

మా అమ్మను మించిన ఆస్తి నాకు లేదు.మా అమ్మ జీవితంలో ఎన్నడూ బంగారు నగలు వేసుకోలేదు. వాటిపై ఆమెకు పెద్ద ఆసక్తి లేదు.అప్పటిలాగే ఇప్పుడు కూడా ఆమె ఒక చిన్న గదిలో సాదాసీదా జీవనం సాగిస్తోంది. ఇప్పటివరకు రెండే రెండు సార్లు మా అమ్మ నాతో కలిసి జనం మధ్యకు వచ్చింది. నేను ఏక్తా యాత్రను ముగించుకొని శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో భారత జెండా ను ఎగురవేసి వచ్చినప్పుడు తొలిసారి అమ్మ నా నుదుట తిలకం దిద్దింది. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా నాతో అధికారిక కార్యక్రమంలో అమ్మ పాల్గొంది” అని బ్లాగ్ పోస్ట్ లో మోడీ వివరించారు.