Dalai Lama : టిబెట్ బౌద్ధ మత అత్యున్నత గురువు దలైలామా తన వారసుడి ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో, ఆయన తన 90వ పుట్టిన రోజును జూలై 6న జరుపుకోబోతున్న వేళ, తన మనసులోని ఇంకొన్ని విషయాలను వెలిబుచ్చారు. అభిమానులు, అనుచరులు పెద్ద సంఖ్యలో దలైలామా దీర్ఘాయుష్షి కోసం పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తుండగా, ఆయన మరో 30–40 సంవత్సరాలు ప్రజల సేవలో ఉండాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. దలైలామా మాట్లాడుతూ..నేను మరికొన్నేళ్లు ఆరోగ్యంగా జీవించగలనన్న సంకేతాలను దేవుడు నాకు ఇస్తున్నాడు. బుద్ధుని బోధనలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. అని స్పష్టం చేశారు. ఇదివరకే, తాను 110 ఏళ్ల వరకు జీవిస్తానన్నదీ ఓ కలలో కనిపించిందని పేర్కొన్నారు.
Read Also: Pregnancy: గర్భిణీ స్త్రీలు గుడికి వెళ్లవచ్చా?! నిపుణులు ఏం చెబుతున్నారు?
ఇటీవల దలైలామా సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. తాను 2011 సెప్టెంబర్ 24న టిబెట్ బౌద్ధ మత పెద్దలతో సమావేశమై, తన వారసుడి ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలా అనే అంశంపై చర్చించినట్లు చెప్పారు. ఈ నిర్ణయానికి అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందనలు వచ్చాయని తెలిపారు. ఈ ప్రక్రియను నిర్వహించే అధికారమంతా గాడెన్ ఫోడ్రోంగ్ ట్రస్ట్‌కు మాత్రమే ఉందని స్పష్టంగా తెలిపారు. ఈ వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకునే హక్కు లేదని, ఇది చైనాపై తీవ్ర విమర్శలుగా భావించబడుతోంది. చైనా, టిబెట్‌పై తన ఆధిపత్యాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో భవిష్యత్తులో దలైలామా పునర్జన్మ ప్రక్రియను నియంత్రించాలనే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో పంచెన్ లామా పాత్ర కీలకంగా మారుతోంది.
1989లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన పంచెన్ లామాపై విష ప్రయోగం జరిగి ఉండవచ్చన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన వారసుడిగా బీజింగ్ ఎంపిక చేసిన బాలుడిని తమ ఆధీనంలో ఉంచుకున్నట్లు గతంలో ప్రకటించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనికి ప్రతిగా, దలైలామా తాను టిబెట్‌లో కాకుండా ఇతర ప్రాంతంలో పునర్జన్మ పొందవచ్చని చెప్పారు. తమ వారసుడిని ఎంపిక చేసేది తాము మాత్రమేనని, ఇందులో చైనాకు ఎలాంటి అధికారమూ లేదని ఆయన పునరుద్ఘాటించారు. దలైలామా చేసిన తాజా వ్యాఖ్యలు టిబెట్ భవిష్యత్తుపై, అలాగే బౌద్ధ మత పరిరక్షణపై కీలక సంకేతాలుగా భావించబడుతున్నాయి. మరికొన్నేళ్లు ప్రజలకు సేవ చేయాలన్న ఆయన తపన, అనుచరులకు ఉత్తేజాన్నిస్తుండగా.. వారసత్వ అంశంపై చైనాకు ఇచ్చిన స్పష్టమైన సంకేతాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యే అవకాశముంది.
Read Also: Kamal Haasan : కమల్ హాసన్‌కు బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు