POK Holy Water : శారదా పీఠ్.. ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో ఉంది. ఈ ప్రాచీన పీఠంలోని శారదా కుండ్ నుంచి పవిత్రజలం అయోధ్య రామయ్య సన్నిధికి చేరింది. అక్కడి నుంచి తన్వీర్ అహ్మద్ అనే ముస్లిం వ్యక్తి అయోధ్యకు పవిత్ర జలాన్ని పంపాడు. సోమవారం (జనవరి 22న) అయోధ్య రామమందిరంలో జరగనున్న భగవాన్ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠాపనోత్సవంలో ఈ జలాన్ని వినియోగించనున్నారు. ఈ పవిత్ర జలాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఇస్లామాబాద్‌కు.. ఇస్లామాబాద్ నుంచి బ్రిటన్‌కు.. బ్రిటన్ నుంచి భారత్‌కు చేరవేయడం గమనార్హం.
We’re now on WhatsApp. Click to Join.
బ్రిటన్‌లో ఉండే తన్వీర్ అహ్మద్ కుమార్తె మగ్రిబీ ఇంటికి శారదా పీఠ్ కుండ్ పవిత్రజలం(POK Holy Water ) చేరింది. 2023 ఆగస్టులో బ్రిటన్‌కు వెళ్లిన కాశ్మీరీ పండిట్ సోనాల్ షేర్‌కు దాన్ని అందజేశారు. బ్రిటన్ నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు.. అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి.. ఢిల్లీ నుంచి అయోధ్యకు శారదా పీఠ్ కుండ్ పవిత్రజలం డెలివరీ అయింది. పవిత్ర జలం పంపడానికి ఇంతలా ఎందుకు శ్రమించాల్సి వచ్చిందంటే.. 2019లో కశ్మీర్‌లో పుల్వామా ఉగ్రదాడి జరిగింది. దీనికి ప్రతిగా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై భారత ఆర్మీ వైమానిక దాడి చేసింది. ఆనాటి నుంచి భారత్, పాక్ మధ్య తపాలా సేవలు కూడా నిలిచిపోయాయి. ఒకవేళ తపాలా సేవలు కొనసాగి ఉంటే.. నేరుగా పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి అయోధ్యకు శారదా పీఠ్ కుండ్ పవిత్రజలం అంది ఉండేది. ఈవివరాలను సేవ్ శారదా పీఠ్ కమిటీ కాశ్మీర్ (SSCK) వ్యవస్థాపకుడు రవీందర్ పండిట్ తెలిపారు. ‘‘శారదా పీఠం నుంచి మాకు మట్టి, రాయి, చెరువు నీరు అందాయి’’ అని చెప్పారు.